Apr 04,2023 21:50

మెట్ల కింద కూర్చున్న జెసి కార్యాలయపు సిబ్బంది

జిల్లా పాలనకు ఏడాది..
- అద్దె భవనాలు.. ఇరుకు గదులు..
- వేధిస్తున్న సిబ్బంది కొరత
- అరకొర సౌకర్యాలతో నామమాత్రంగా పాలన
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో పాలనకు ఏడాది అయింది. అరకొర సౌకర్యాల మధ్య పాలన సాగుతుంది. జిల్లాల విభజనలో భాగంగా నంద్యాలను గత ఏడాది 2022 ఏప్రిల్‌ 4న జిల్లాగా ఏర్పాటు చేసిన విషయం విధితమే. జిల్లాకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వైపల్యం చెందింది. నంద్యాలను జిల్లాగా చేసినప్పటికి తగ్గటుగా నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు నామమాత్రంగానే జరుగుతున్నాయి.
అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో కార్యాలయాలు
జిల్లా ఏర్పడి ఏడాదైనా నేటికీ అద్దె భవనాల్లోనే పాలన కొనసాగుతుంది. జిల్లా అయితే రూపురేఖలు మారుతాయాన్న ఇక్కడి ప్రజల ఆశలు అడియాశలుగానే మిగిలాయి. జిల్లా కలెక్టరేట్‌ తాత్కాలికంగా వ్యవసాయ పరిశోధన సంస్థలో ఏర్పాటు చేసినప్పటికి కలెక్టర్‌ కార్యక్రమం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలాగే ఉంది తప్ప కలెక్టర్‌ కార్యాలయంలా లేదు. విశాలమైన గదులు లేకపోవడంతో కలెక్టర్‌ ఛాంబర్‌లో పది మందికూడా కూర్చోలేని స్థితి ఉంది. జెసి ఛాంబర్‌లోకి ఐదుగురు వెళ్లితే ఇరుకుగా ఉంటుంది. ఇక కలెక్టర్‌, జెసిలకు ప్రత్యేకంగా అంటూ ఎసి గదులంటూ లేకపోవడం కొసమెరుపు. జెసి కార్యాలయ సిబ్బంది ఏకంగా మెట్ల కింద టేబుల్‌ వేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. సిసికి కూర్చోడానికి కనీసం ఒక రూమ్‌ కూడా లేదు. కలెక్టర్‌ కార్యాలయంలోనే మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. ఇక బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్స్‌ వద్ద క్వార్టర్స్‌లో ఐసిడిఎస్‌, ఫిషరీస్‌, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా సర్వే రికార్డుల శాఖ, జిల్లా సహకార శాఖ, జిల్లా ఉద్యాన శాఖ, సూక్ష్మ బిందు సేద్యం, వంటి కార్యాలయాలు ఉన్నాయి. ఇరుకు గదులు ఉండడంతో సిబ్బంది అలాగే కాలం వెలిబుచ్చుతున్నారు. కనీసం మూత్రశాలలు కూడా సరిగా లేకపోవడంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి కనీసం నీరు కూడా లేకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బయట నుండి బాటిల్స్‌ తెచ్చుకోవడం, లేకపోతే డబ్బులు వెచ్చించి నీళ్ల క్యాన్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
జిల్లాలో సిబ్బంది కొరత...
కొత్త జిల్లాలో సిబ్బంది కొరతతో పాలన ముందుకు సాగడం లేదు. కావాల్సిన ఉద్యోగులను, సిబ్బందిని పూర్తిస్థాయిలో కేటాయించకపోవడం వలన ఉన్న సిబ్బందిపై పని భారం తీవ్రంగా పడుతుంది. రెవిన్యూ విభాగంలో అత్యధికంగా మండలాల నుండి సిబ్బందిని డిప్యూటేషన్‌పై తెచ్చుకొని పని చేయించుకుంటున్న పరిస్థితి నెలకొంది.కొత్తగా పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. జిల్లా విద్యా శాఖలో డిఇఒ ఇన్‌చార్జీగానే ఉన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌ అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో - ఆర్డినేటర్‌ కూడా డిఇఒనే చూస్తున్నారు. రెండు పోస్టులు కావడంతో పని భారం పెరిగి విధులకు న్యాయం చేయలేకపోతున్నారు. పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టు ఖాళీ ఉండగా ఈ బాధ్యతను ఏడి స్థాయిలో ఉన్న ఓ అధికారే నిర్వర్తిస్తున్నారు. 9 సీనియర్‌ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ ఒక్కరిని ఇచ్చారు. ఈ శాఖకు ఏడాది అయినా సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉంది. సరైన ఇన్‌ఫ్రాÛస్ట్రక్చర్‌ కంప్యూటర్లు, ప్రింటర్‌ వంటి సరిపడ లేకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి. గ్రేడ్‌-1 నుంచి గ్రేడ్‌-4 పోస్టులు 142 ఖాళీ ఉన్నాయి. గ్రేడ్‌-2 పోస్టులు 21, టైపిస్టులు 2, ఒక రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇంత పెద్ద విభాగం అయిన జిల్లా పంచాయితీ కార్యాలయంలో ఏఓ పోస్టును భర్తీ చేయలేదు. వీటిని భర్తీ చేయడంలో జిల్లా ఉన్నత అధికారులు దృష్టి పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. ఇలా అనేక శాఖల్లో నేటికీ పూర్తి స్థాయి సిబ్బంది లేరు. జిల్లా కేంద్రంగా నంద్యాల ఏర్పడినప్పటికి స్వరూపం మార్చడంలో, కలెక్టర్‌ కార్యాలయంకు ఇంతవరకు స్థలం సేకరించలేదు. కలెక్టరేట్‌ ఎక్కడ ఏర్పాటు కాబోతుందో అధికారుల్లోనే స్పష్టత లేదు. స్త్రీశిశు సంక్షేమ శాఖలోనూ రెగ్యులర్‌ పిడి లేకపోవడంతో పాలన అంతంత మాత్రంగానే ఉంది.