Nov 20,2023 19:58

సమావేశంలో మాట్లాడుతున్న రాధాకృష్ణ

ప్రజాశక్తి - ఆస్పరి
జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్‌.రాధాకృష్ణ, కెవి.నారాయణ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక రామతీర్థం దగ్గర ఆస్పరి, ఆలూరు, హాలహర్వి మండలాల సమావేశం నిర్వహించారు. సిపిఎం మండల నాయకులు బాలకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. బతుకెందుకు అవ్వకాశం లేక వ్యవసాయ కూలీలు పిల్లాపాపలతో కలిసి వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం కింద పనులు చేపట్టి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు ప్రభుత్వమని జగన్మోహన్‌ రెడ్డి, ప్రధాని మోడీ నిరంతరం గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. దశాబ్దాల తరబడి వర్షాధారంపైనే జీవిస్తున్న జిల్లా రైతులకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఉంటే ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులు వచ్చేవి కాదన్నారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు ఉన్నా ఈ ప్రాంతంలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తే ప్రయోజనం లేదని, వెంటనే పోరుకు సిద్ధం కావాలని కోరారు. జిల్లాలో కరువు సహాయక చర్యల్లో భాగంగా ఎకరాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేలు, కేంద్రం రూ.25 వేలు ఇవ్వాలని, కూలీలకు కూడా కరువు భత్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనిని 200 రోజులకు పెంచి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని కోరారు. లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు హనుమంతు, ఆలూరు మండల కార్యదర్శి షాకీర్‌, నాయకులు నారాయణ స్వామి, రంగస్వామి, రామాంజినేయులు, రవి, మధు రెడ్డి, మల్లికార్జున, రంగప్ప, మైనా, ఈరన్న, గోవర్ధన్‌, విఠల్‌, ధనంజయ పాల్గొన్నారు.