Nov 09,2023 23:14

ప్రజాశక్తి-వత్సవాయి: డప్పు కళాకారులకు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి ద్వారానే గుర్తింపు కార్డులివ్వాలని ఎపి డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కుటుంబరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం వత్సవాయి మండలం పరిషత్‌ అభివృద్ధి కార్యాలయ అధికారి ఎస్‌.రాజు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కుటుంబరావు మాట్లాడుతూ 2006 నుండి ఎపి డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాట ఫలితంగా 2013లో డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు సాధించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌, రాష్ట్రం విడిపోయాక విజయవాడ నుండి ఇస్తూ వచ్చిన ప్రభుత్వ గుర్తింపు కార్డులను తిరిగి పోరాటం ద్వారా జిల్లా కేంద్రాల నుండే ఇచ్చే విధంగా సాధించామన్నారు. నేడు మళ్లీ విజయవాడ నుండి ఇస్తామంటున్న ప్రకటన ద్వారా నిరక్షరాస్యులైన దళిత డప్పు కళాకారులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. జిల్లా కేంద్రం నుంచే గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్‌ హనుమంతరావు, బి.రాము, జి.ఆదాం, వి.వెంకటరత్నం, కె.వీరబాబు, బెంజమిన్‌, బాబు, నాగేశ్వరరావు, ప్రభాకర్‌, శివయ్య తదితరులు పాల్గొన్నారు.