Jul 22,2023 21:52

కొత్తగా వచ్చిన ఇవిఎలంను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : జిల్లా కేంద్రానికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఇవిఎంలు) చేరుకున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఇవిఎంలను భద్రపరిచేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన భవనంలో భద్రపర్చారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ సంబంధిత అధికారులతో కలిసి అనేక సార్లు భవనాన్ని పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇవిఎంలు గోడౌన్‌ ఖరారు చేశారు. ఎన్నికల సంఘం 3,170 కొత్త బిఎల్‌ఎం3 ఇవిఎంలు, వివిపిఎటిఎస్‌ను కేటాయించింది. ఈ వారం చివరి నాటికి జిల్లాకు చేరుకోనుంది. విశాఖపట్నం నుండి 3,600 బ్యాలెట్‌ యూనిట్లు (బి.యులు), 1500 కంట్రోల్‌ యూనిట్లు (సియులు), కాకినాడ నుండి 1250 సియులు కూడా కేటాయించారు. ఇవిఎంలను పరిశీలించేందుకు ప్రతినిధులను పంపించాలని, వారి సమక్షంలోనే గోడౌన్‌ తెరవడం జరుగుతుందని జిల్లా యంత్రాంగం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. విశాఖపట్నం నుంచి జిల్లాకు కేటాయించిన ఇవిఎంలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. కలెక్టర్‌తో పాటు ఎస్‌పి విక్రాంత్‌పాటిల్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావు ఇవిఎంల స్వీకరణ ప్రక్రియను శనివారం పర్యవేక్షించారు. పార్టీల ప్రతినిధులు పరిశర్ల అప్పారావు , గొట్టపు వెంకట నాయుడు (టిడిపి) తదితరులు హాజరయ్యారు.