
ప్రజాశక్తి-నెల్లూరు : స్థానిక రేబాలవారి వీధి ప్రాంతంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కవిసమ్మేళనం, కవిత సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతు శారద హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన 28 మంది కవితా రచయిత్రులు పాల్గొని వారు రచించిన విలువైన పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవితా రచయిత్రులను పౌరగ్రంథాలయ ఉపసంచాలకులు ఎస్‌కె పీర్ అహ్మద్ సన్మానించారు. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సైన్స్ వేదిక అద్యక్షులు ఎం.సతీష్ కుమార్, జిల్లా గ్రంథలయ కార్యదర్శి కె.కుమార్‌లు మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని ప్రతి రోజు నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన, దాని ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయాధికారి సిహెచ్ ప్రసాద్, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.