రాయచోటి : జిల్లాలో ఇప్పటికి ప్రకటించిన కరువు మండలాలు కంటే ఎక్కువగా ఉన్నాయని వాటినీ ప్రకటించాలని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిపురం రామచంద్ర, ఉపాధ్యక్షులు నాగ బసిరెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికీ మన జిల్లాలో 18 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించారు అన్నారు. మిగిలిన 12ను కరువు మండలాలుగా ప్రకటించాలని, రైతులును, వ్యవసాయ కూలీలను ఆదుకో వాలని, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులకు పశుగ్రాసం లేక పాడిపశువులు, గొర్రెలు ఇతర వాటిని ఇప్పటికే కబేళాలకు తరలిస్తున్నారని వాపోయారు. వెంటనే పశుగ్రాసంతో పాటు రైతన్నలు అదుకోవాలన్నారు. అరకొర వర్షాలతో పండించిన పంటలు చేతికి రాకపో వడంతో రైతాంగం సంక్షోభంలో పడిందని, ప్రభుత్వం రైతులకు పంట నష్టం కింద రూ. 50 వేలు , పంట పెట్టని రైతులకు 20 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. రైతన్నలు బ్యాంకుల్లో తీసకున్న రుణం రూ. 2 లక్షల మాఫీ చేయాలన్నారు. అన్ని మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాయచోటిటౌన్ : జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని, సాధారణం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదైందని, సగానికి పైగా పంట సాగు తగ్గిపోయిందని ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాల్లో అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తూతూమంత్రంగా కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022-23 ఖరీఫ్ సకాలంలో వర్షాలు లేకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని, కనీసం పెట్టుబడులైనా వస్తాయని ఆశించిన రైతులకు పశు గ్రాసం కూడా మిగలని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 3 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. 27 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదై 23 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం 18 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకోవడం దుర్మార్గమన్నారు. ఖరీఫ్ పంట దిగుబడి నష్టం, వర్షాభావ పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కించి జిల్లాలో నెలకొన్న కరవుపై అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి సాగు దుస్థితిని అంచనా వేసి అధికారులు చేసిన ప్రతిపాదనలకు, ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాకు పొంతన లేకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని లేని పక్షంలో రైతులను సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.