Mar 17,2023 23:18

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు:రంపచోడవరం,చింతూరు డివిజన్లలో జిల్లా అధికారులు ప్రతి నెల పర్యటించాల్సిందేనని జిల్లా కలక్టర్‌ ఆదేశించారు. శుక్రవారం స్పందన అనంతరం హాజరైన అధికారులతో సమీక్షిస్తూ ఆ రెండు డివిజన్లలో కుడా నెలకు కనీసం మూడు రోజులు పర్యటించి దిగువ స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించాలన్నారు. శాఖాపరంగా సమస్యలను పరిష్కరించాలని కలక్టర్‌ సూచించారు. స్పందనలో అందిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించాలని కలక్టర్‌ ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే ఒక విచారణాదికారిని నియమించాలని, అవసరమైతే సంబంధిత శాఖాధికారి వ్యక్తిగతంగా విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. స్పందనలో అందిన ఫిర్యాదులను, ఆర్ధిక, ఆర్దికేతర అంశాలుగా విభజించి ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఆర్థిక అంశాలు, పాలసీ విషయాలకు సంబంధించి తగు విచారణ జరిపి ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. ఫిర్యాదుపై తగిన కారణం నమోదు చేసి ఫోటోలతో సహా వెబ్‌ పోర్టల్‌లో అప్లోడ్‌ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్పందన దరఖాస్తులను నిరంతరం సమీక్షిస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్‌ ఫైల్‌ చేయాలని, తద్వారా వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలు తగ్గుతాయని సూచించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి రోణంకి గోపాలకృష్ణ, సబ్‌ కలక్టర్‌ వి.అభిషేక్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.