Jul 23,2023 21:58

రాజగోపాలరావు విగ్రహానికి పూలమాలలు వేస్తున్న స్పీకర్‌ సీతారాం

- శాసనసభ స్పీకర్‌ సీతారాం
ప్రజాశక్తి- కోటబొమ్మాళి: 
మాజీ పార్లమెంట్‌ సభ్యులు బొడ్డేపల్లి రాజగోపాలరావుతోనే జిల్లా సస్యశ్యామలమైందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని శ్రీజగన్నాథపురం పంచాయతీ పొడుగుపాడులో కొత్తగా ఏర్పాటు చేసిన రాజగోపాలరావు విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళింగులను బిసి జాబితాల్లో చేర్పించి వారి ఉన్నతికి పాటుపడ్డారని అన్నారు. ఆముదాలవలస నుంచి రాజకీయాలకు సెంటిమెంట్‌ ప్రారంభమైందని అన్నారు. అక్కడ నేనే గెలిస్తే రాష్ట్రంలో వైసిపి, కూన రవికుమార్‌ గెలిస్తే టిడిపి, సత్యవతి గెలిస్తే కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్రంలో వస్తాయని చమత్కరించారు. టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ మాట్లాడుతూ రాజగోపాలరావు చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయని అన్నారు. వంశధార ప్రాజెక్టును రాజగోపాలవు తీసుకొస్తే... రెండో ఫేజ్‌ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మంత్రిగా సీతారాం తీసుకువచ్చి దిగువ రైతులకు సాగునీరు అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన చైర్మన్‌ పేరాడ తిలక్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పిరియా విజయ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి, ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, వైసిపి జిల్లా మహిళా అధ్యక్షులు చింతాడ మంజు, సర్పంచ్‌ నూక సత్యరాజు, ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, విశ్రాంతి జడ్జి బొడ్డేపల్లి రామారావు, డాక్టర్‌ బలగ మురళి పాల్గొన్నారు.