సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్
కడప అర్బన్ : జిల్లా అభివద్ధికి ఆక్సిజన్ లాంటి కడప ఉక్కు పరిశ్రమకు మోడీ మొండిచేయి చూపించడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆధ్వర్యంలో కడప జిల్లాలోని ఐరన్ ఓర్లుపై పరిశోధనలు చేశారని తెలిపారు. జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో ఫస్ట్ క్వాలిటీ ఐరన్ ఓర్లు 150 సంవత్సరాలకు కావలసినంత ముడిసరుకు ఉందని నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. విభజన చట్టంలో ఆమోదించబడ్డ ఉక్కు పరిశ్రమ హామీకి మోడీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 2018 డిసెంబర్‌లో నాటి సిఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారన్నారు. 2019 డిసెంబర్‌లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కన్యతీర్థం వద్ద శంకుస్థాపన చేశారన్నారు. కడప ఉక్కు పరిశ్రమకు ముగ్గురు ముఖ్యమంత్రులు నాలుగు దఫాలు శంకుస్థాపనలు చేసిన ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదన్నారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి మరో మారు 2023, ఫిబ్రవరిలో రెండవసారి అదే చోట మళ్లీ శంకుస్థాపన చేసి 30 నెలల్లో రూ.8,800 కోట్లతో కడప ఉక్కు పరిశ్రమ మొదటి దశ పూర్తవుతుందని చెప్పి నేటికీ ఆరు నెలలు గడిచిపోయిందని కనీసం ప్లాంటుకు కేటాయించిన స్థలానికి ప్రహరీ గోడ కూడా కట్టలేదన్నారు. పార్లమెంటు సాక్షిగా మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఉక్కు నాట్ ఫీజిబిలిటీ అని ప్రకటన చేస్తే పార్లమెంటులోని రాష్ట్ర ఎంపీలు ప్రశ్నించలేకపోయారని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి దేశ ప్రజలకు అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుతం ప్రజలను కడప ఉక్కు వస్తుందని ఊరిస్తోందని జిల్లా ప్రజల్లో గాని, రాష్ట్ర ప్రజల్లో గాని బిజెపిపైన, వైసిపి ప్రభుత్వం పైన నమ్మకం లేదన్నారు. జిల్లాలో బిజెపి యేతర కలిసి వచ్చే పార్టీలతో, ప్రజాసంఘాలతో, మేధావులతో భవిష్యత్తులో ఉద్యమ చేపడతామని తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ.ఎన్.సుబ్బమ్మ, ఎ.రామ్మోహన్, బి.మనోహర్ పాల్గొన్నారు.










