
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)లో ఏడురోజుల శిశువు కిడ్నాప్ కలకలం రేపింది. అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఆస్పత్రిలో భద్రతా లోపాల డొల్లతనం మరోసారి వెల్లడింది. ఆస్పత్రిలో శిశువుల అపహరణ కొత్తకాకున్నా ఈసారి పట్టపగలే ఒక మహిళ తీసుకువెళ్తున్నా భద్రతా సిబ్బంది ఎవ్వరూ గమనించ లేదు. ఆస్పత్రిలో పోలీసుల నిఘా అంతంత మాత్రంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. మొత్తం ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది కనుసన్నల్లోనే భద్రతా ఏర్పాట్లు మొక్కుబడిగా ఉన్నాయి.
గతేడాది ఇదే రీతిలో ఒక శిశువును రాత్రి వేళ కిడ్నాప్ చేయగా 36 గంటల తరువాత పోలీసులు నిందితురాలిని గుర్తించి శిశువును రక్షించారు. శిశువుల ఆచూకీ తెలియని ఘటనలూ ఉన్నాయి. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి జరిగినా మంగళవారం జరిగిన కిడ్నాప్ వ్యవహారంలో నిందితురాలి ఆచూకిని ఇంకా కనుగొనలేకపోయారు. సిసి కెమెరా పుటేజిలో నిందితురాలి ఫొటో స్పష్టంగా కనిపించింది. శిశువును తీసుకువెళ్తున్న దృశ్యాలను అధికారులు రికార్డుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసు అధికారులంతా నగరంపాలెం వద్ద మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు నేపథ్యంలో బందోబస్తులో నిమగం కావడంతో శిశువు కిడ్నాప్ వ్వవహారం సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది.
గతేడాది అరండల్‌పేట, ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లలను అపహరించిన మహిళను సిసి పుటేజీల ఆధారంగా పోలీసులు రెండు రోజుల వ్యవధిలో పట్టుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డి ప్రాంతానికి చెందిన కిడ్నాప్ ముఠా పనిగా నిర్ధారించారు. ఆ కేసులో అరెస్టయిన నిందితులకు తరువాత బెయిల్ వచ్చింది. అయితే ఈ సారి సిసి కెమెరాలో రికార్డయిన మహిళకు, గతేడాది పట్టుపడిన మహిళకు సంబంధం లేదని కొత్తపేట పోలీసులు తెలిపారు. మాత శిశుసంరక్షణ కేంద్రం వార్డు నుంచి శిశువును అపహరించినట్టు కొద్దిసేపటికే గుర్తించినా పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసిఉంటే కొంత ఫలితం ఉండేదనే వాదన వినిపిస్తోంది.
గుంటూరులోని కొబ్బరికాయల సాంబయ్య కాలనీకి చెందిన షేక్ రోష్నికి గతనెల 26న బాలిక శిశువు జన్మించింది. మంగళవారం సాయంత్రం డిశ్చార్జి కావాల్సి ఉండగా మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో శిశువుకు పాలుపట్టిన రోష్ని కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు నిద్రకు ఉపక్రమించింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిద్రలేచి చూసేసరికి శిశువు కన్పించకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కొత్తపేట సిఐ అన్వర్ బాష తెలిపారు. అధికారులు ఆస్పత్రిలోని 106 వార్డును సందర్శించి వివరాలు సేకరించారు. అనుమానిత మహిళ ఫొటో, వీడియోను మీడియాకు పంపామని తెలిపారు. ఆచూకి తెలిసినవారు కొత్తపేట సిఐ 8688831320, ఎస్‌ఐ 8688831321 నంబర్లుకు సంప్రదించాలని కోరారు.