May 19,2023 00:51

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈవినింగ్‌ క్లినిక్‌ను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభావతి గురువారం ప్రారంభించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డిఎంఇ) ఆదేశాల మేరకు ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించామని ఆమె చెప్పారు. అంతకు ముందు ఓపీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండేదని, ఇక నుంచి సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈవెనింగ్‌ క్లినిక్‌ పేరుతో ఓ పి సేవలు అందిస్తామని తెలిపారు. ఓపీలో వైద్యులు రాసిచ్చిన వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలను అదే ఓపీలో వైద్యులకు చూపించాలన్నారు. దానికి వల్ల రోగులకు అత్యవసర సేవలు పొందడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఒ డాక్టర్‌ బి.సతీష్‌ కుమార్‌, డిప్యూటీ ఆర్‌ఎంఒ డాక్టర్‌ ఝాన్సీ పాల్గొన్నారు.