May 16,2023 20:56

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సృజన

ప్రజాశక్తి - కర్నూలు హాస్పిటల్‌
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఇబ్బంది లేకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ధన్వంతరి సమావేశ మందిరంలో హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. శానిటేషన్‌కు సంబంధించి ప్రతి అంశానికీ ఎస్‌ఒపి (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) ఉంటుందని తెలిపారు. టాయిలెట్స్‌ ఎన్ని సార్లు శుభ్రం చేయాలి, ఎవరు క్రాస్‌ చెక్‌ చేయాలి, తదితర అంశాలతో కాంట్రాక్టర్‌తో ఎంఒయు చేసుకుంటామని చెప్పారు. ఆస్పత్రిలో పారిశుధ్య చర్యల పట్ల కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఒయులో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రోజూ ఎన్ని బాత్‌ రూమ్స్‌ శుభ్రం చేశారు, రెండో సారి ఎప్పుడు వచ్చారు?, ఏ మెటీరియల్‌తో శుభ్రం చేశారు తదితర సూక్ష్మ వివరాలను లెక్కించి ఆ మేరకు సంబంధిత హెచ్‌ఒడిలు, వార్డ్‌ ఇన్‌ఛార్జీలు సర్టిఫై చేయాలని ఆదేశించారు. అలాగే థర్డ్‌ పార్టీ చెక్‌ కూడా చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి ఆస్పత్రి పరిశుభ్రంగా ఉండాలని, అలా లేకపోతే సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టాయిలెట్ల మరమ్మతులు, నిర్మాణాలకు సంబంధించి కూడా యాంత్రికంగా, అమానవీయంగా కాకుండా రోగులకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా నిర్మించిన డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌ను రోగులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆస్పత్రిలోని అన్ని విభాగాల హెడ్‌లను సంప్రదించి అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాలను అంచనా వేసి నివేదికను ఈ నెల 23లోపు తనకు అందజేయాలని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి, ఎపిఎస్‌ఎంఐడిసి ఇఇ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. సమావేశంలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల ప్రారంభించిన నిర్మాణాలపై థర్డ్‌ పార్టీతో క్వాలిటీ చెక్‌ చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో అన్ని వార్డులకు తగినంత నీటిని సరఫరా చేసేందుకు ఈనెల 24 నాటికి 3 బోర్‌ వెల్స్‌ తవ్వకం పూర్తి చేయాలని ఎపిఎస్‌ఎంఐడిసి అధికారులను ఆదేశించారు. జనరేటర్లకు సంబంధించి సర్వీసింగ్‌, మెయింటనెన్స్‌కు సంబంధించి నెలకు, సంవత్సరానికి ఎంత మొత్తం అవసరమనే వివరాలను రెండు రోజుల్లోపు నివేదికను అందజేయాలని తెలిపారు. అలాగే ఆస్పత్రిలో ఎయిర్‌ కండిషనర్లు కూడా ఎన్ని పని చేస్తున్నాయి, కొత్తవి ఎన్ని అవసరం, ఎంత ఖర్చు అవుతుందన్న వివరాలను రెండు రోజుల్లోపు తనకు అందజేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని అన్ని ఫ్లోర్లలోని వార్డులు, కారిడార్లలోనూ, ఎంట్రీ, ఎగ్జిట్‌ ప్రదేశాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఆస్పత్రిలో ఇటీవల ప్రారంభించిన నిర్మాణాల్లో క్వాలిటీ పూర్‌గా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి పరిశుభ్రం కోసం ప్రతి నెలా రూ.72 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. శుభ్రత లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సెక్యూరిటీ కోసం రోజుకు రూ.1.06 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 180 మంది సెక్యూరిటీ ఉండాలని, 70, 80 మంది కూడా లేరని చెప్పారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ... డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌ నిర్మాణానికి ముందే అన్ని సదుపాయాలూ, పరికరాలను కలిపి అంచనాలు ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని ఎపిఎస్‌ఎంఐడిసి అధికారులను ప్రశ్నించారు. ఆస్పత్రిలోని టాయిలెట్స్‌ పరిశుభ్రంగా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డిఎంహెచ్‌ఒ కార్యాలయ సిబ్బంది సరిగా స్పందించడం లేదని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ... ఆస్పత్రిలో ఇటీవల ప్రారంభించిన నిర్మాణాలపై క్వాలిటీ చెక్‌ చేయించాలని కలెక్టర్‌ను కోరారు. ఆస్పత్రిలో పరిశుభ్రతకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఆలస్యంగా ఇస్తున్నందున ఎస్‌ఒపి ఫాలో కావడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఆస్పత్రి ఎడి వల్ల చెడ్డ పేరు వస్తోందని, విచారణ చేయించాలని తెలిపారు. డిఎంహెచ్‌ఒ కార్యాలయ సూపరింటెండెంట్‌ సక్రమంగా పని చేయడం లేదని, నగరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను విజిట్‌ చేయాలని సూచించారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ... ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో మృతదేహాల పోస్టుమార్టం అంశంలో కొంత మంది లేబర్‌ ఎలాంటి జీతాలూ లేకుండా పని చేస్తున్నారని, వారికి ఎంతో కొంత మొత్తంలో జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఎమర్జెన్సీ కేర్‌, ఎఎంసిలలో ఎసిలు పని చేసే విధంగా చూడాలని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌ తేజ, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ రామగిడ్డయ్య, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.