Jul 25,2023 23:36

ఓపీ కేంద్రం పరిశీలనలో భాగంగా సిబ్బందితో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో ఓపీ రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను గణనీయంగా పెంచుతున్నట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. గుంటూరుతో పాటు అయిదారు జిల్లాల నుంచి ఎక్కువ మంది రోగులు వస్తుందటంతో రద్దీ ఎక్కువై ఆస్పత్రి కిట కిటలాడుతోందని, రోగులు ఎటు నుంచి ఎటు వైపు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఓపీ రిజిస్ట్రేషన్‌కేంద్రం వద్ద రద్దీని నియంత్రించేందుకు వీలుగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిరుయోగం పడి ఉన్న ద్విచక్ర వాహన షెడ్డును తగు మార్పులు చేసి పది రిజిస్ట్రేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు ఇంజినీరింగ్‌ శాఖ అధికారులతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఒక్కొక్కటి 6 అడుగుల వెడల్పు, 5 అడుగుల పొడవుతో ఓపీ గది ఏర్పాటుకు ఇంజినీరింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్న సామగ్రితో తక్కువ ఖర్చుతో పనులు చేయాలని ఇంజినీరింగ్‌ శాఖాధికార్లకు సూచించగా వారు అంగీకరించినట్లు చెప్పారు. ఓపీ వేళలనూ మార్చామని, ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపి రిజిస్ట్రేషన్‌ ఉంటుందని తెలిపారు.