
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు సూపరింటెండెంట్ డాక్టర్ వై.కిరణ్‌కుమార్ తెలిపారు. అన్నిస్థాయిల్లో పర్యవేక్షణ పెంచుతున్నట్టు తెలిపారు. ఆస్పత్రి అత్యవసర విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి అత్యవసర కేసులకు వీలైనంత త్వరగా చికిత్సలు అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు చెప్పారు.
అత్యవసర విభాగాన్ని ప్రక్షాళన చేశారా?
అత్యవసర విభాగంలో మంచాల కొరతను నివారించాం. ఈ విభాగంలోకి వచ్చిన వెంటనే ప్రాథమిక చికిత్సలు చేసి వెంటనే వార్డుకు పంపేవిధంగా ఏర్పాటు చేశాం. ఎక్కువ సేపు స్ట్రెక్చర్‌పై ఉంచే విధానాన్ని పూర్తిగా తొలగిం చాం. సీనియర్ వైద్యులను నిరంతరం అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ప్రధా నంగా క్యార్డియాలజిస్టు, న్యూరో సర్జన్, జనరల్ మెడిసిన్ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. బ్లడ్ బ్యాంకును కూడా 24 గంటలు అందుబాటులోకి తెచ్చాం. అత్యవసర విభాగంనుంచి స్టెప్‌డౌన్ ఐసియుకి పంపేలా రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు, 30 పడకలు ఉండేలా పనులు జరుగుతున్నాయి. నెలరోజుల్లో ఈ విభాగం సిద్ధమవుతుంది. వెంటిలేటర్ ఐసియూ సిద్ధమైతే ఎక్కువ మంది రోగులు ప్రాణాపాయం నుంచి బయటపడతారు. జిరో అవర్ ట్రీట్‌మెంట్‌ను గోల్డ్‌న్ అవర్‌గా మార్చాలని కోరుతున్నాం. రెండో ఆపరేషన్ థియేటర్ ప్రారంభించిన తరువాత ఈ విభాగంలోచాలా వరకు సమస్యలు తగ్గాయి.
ఎంసిహెచ్ నూతన భవన నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది?
మాత శిశుసంరక్షణ కేంద్రం (ఎంసిహెచ్) రూ.80 కోట్లతో 600 పడలక సామర్ధ్యంతో నిర్మిస్తున్న ఈ భవన సముదాయం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఖర్చును పూర్తిగా గుంటూరు మెడికల్ కళాశాల పూర్వవిద్యార్థులే భరిస్తున్నారు. గైనకాలజీ, ప్రసూతి విభాగం, చిన్న పిల్లల సంరక్షణ, శస్త్రచికిత్సల విభాగం మొత్తం ఈ భవనంలోనే ఉంటాయి. సెల్లార్‌తో పాటు మరో ఐదంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మూడో అంతస్తు శ్లాబ్ పనులు జరుగుతున్నాయి. ఈ సముదాయం సిద్ధమైతే ఆస్పత్రిలో ప్రస్తుతం గర్బిణీలకు కష్టాలు తొలగినట్టే.
ఒపి విభాగంలో ఎదురవుతున్న సమస్యలు?
ఆయుష్మాన్ భారత్ చికిత్సల్లో భాగంగా ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు తప్పని సరిచేశారు. అంతేగాక పరీక్షల వివరాలు, ఎక్స్‌రే, స్కానింగ్ నివేదికలు ఫోన్లకు పంపడానికి ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నెంబరు అవసరం ఉంది. ఇందుకోసం వీటి వివరాల నమోదుకు జాప్యం జరుగుతోంది. గతంలోకేవలం పేరు చెబితే ఒపి స్లిప్ ఇచ్చేవారు. ఇప్పుడు వీటి వివరాలు నమోదు వల్ల కొంత జాప్యమవుతోంది. జాప్యం నివారణకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఫోన్ నెంబరు లేని వారు కనీసం వారి వాలంటీర్ నెంబరు అయినా ఇవ్వాలని కోరుతున్నాం. ప్రస్తుతం నాలుగైదు కౌంటర్ల వల్ల తొక్కిసలాట జరుగుతోంది. ఇందుకోసం మరో 11 కౌంటర్లు ఏర్పాటుకు నిర్ణయించాం.
ఒపి విభాగంలో నిత్యం ఎంత మంది వస్తున్నారు?
గతంలో 1500 మంది వచ్చేవారు. ఇప్పుడు 3500 మంది వస్తున్నారు. అత్యవసర విభాగానికి 750 మంది వరకు వస్తున్నారు. ఒపి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండేలా చూస్తున్నాం. ఆస్పత్రిలో ఇన్‌పెషెంట్స్ 1600 మంది వరకు ఉంటున్నారు. నాల్గో తరగతి సిబ్బంది సంఖ్య బాగా తక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులున్నాయి. ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో 600 మందికి గాను 120 మంది ఉన్నారు.