Jun 27,2023 00:30

ఆపరేషన్‌ పూర్తయిన తరువాత రోగినిపరిశీలిస్తున్న డాక్టర్‌ గోకలే, సూపరింటెండెంట్‌ ప్రభావతి

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో దాదాపు రెండేళ్ల తర్వాత గుండె ఆపరేషన్లు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఒకరికి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీని విజయవంతంగా చేసినట్లు ప్రముఖ గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. సూపరింటెండెంట్‌ ఛాంబర్‌లో సోమవారం డాక్టర్‌ ప్రభావతితో కలిసి ఆపరేషన్‌ వివరాలను వెల్లడించారు. కోవిడ్‌ వల్ల గుండె శస్త్ర చికిత్సలు ఆగిపోయాయని, దీనివల్ల బాధితులు అనేక అవస్థలు పడుతున్న అంశాన్ని పలువురు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో మళ్లీ అనుమతి లభించిందని చెప్పారు. రాబోయే ఆరు నెలలు ఏడాది లోగా ఎక్కువ సంఖ్యలో శస్త్ర చికిత్సలు చేసేలా ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. గతంలో సహృదయ ట్రస్ట్‌ ద్వారా శస్త్ర చికిత్సలు చేసామని, ఈసారి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేస్తామని చెప్పారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్‌ చంద్రకుమార్‌, డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ రామరాజు పాల్గొన్నారని తెలిపారు. సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ నగరానికి చెందిన ఒకరికి బైపాస్‌ సర్జరీ విజయవంతంగా చేసిన డాక్టర్‌ గోఖలే బృందానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సమావేశంలో సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఒ డాక్టర్‌ సతీష్‌కుమార్‌, అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.