Oct 02,2023 00:41

ఆపరేషన్‌ థియేటర్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింతగా వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో రూ.50 లక్షలతో రెండు ఆపరేషన్‌ థియేటర్లు, ఓపీ రిజిస్ట్రేషన్‌ కేంద్రం, రక్తనిధి కేంద్రాలను కలెక్టర్‌ ఆదివారం ప్రారంభించారు. 104 వార్డు సమీపంలో నూతనంగా శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కులో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అందించిన మొక్కలను నాటారు. ఈ సందర్బంగా ఆస్పత్రిలో రూ.5 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టర్‌కు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ వివరించారు.రూ.40 లక్షలతో ఆపరేషన్‌ థియేటర్‌కు అవసరమైన కొత్తగా యంత్ర పరికరాలను ఎపిఎంఎస్‌ఐడిసి ద్వారా సమకూర్చామని, ఓపీ కేంద్రం నిర్మాణానికి దాతలు సహచరించారని చెప్పారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. గతంలో సర్జరీల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదని, ఇకపై ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 11 ఓపీ కేంద్రాలనూ ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌, మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, డిప్యూటీ మేయర్లు వనమా వజ్ర బాబు, సజీల, డిప్యూటీ సూపరింటెండెంట్‌లు డాక్టర్‌ శ్రీనివాస ప్రసాద్‌, డాక్టర్‌ గోవిందా నాయక్‌, సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఒ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఆశా సజని, అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.
ఆధునీకరించిన డయాలసిస్‌ యూనిట్‌ ప్రారంభం
జిజిహెచ్‌లో నెఫ్రాలజీ, డయాలసిస్‌ యూనిట్‌ రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అన్నారు. ఆసుపత్రిలో నాట్కో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నెఫ్రాలజీ వార్డులో డయాలసిస్‌ యూనిట్‌ను ఆధునికరించగా నాట్కో సంస్థ అధినేత నన్నపనేని వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ నాట్కో సంస్థ అత్యాధునికంగా అద్భుతమైన డయాలసిస్‌ యూనిట్‌గా తీర్చిదిద్దని చెప్పారు. నాట్కో సంస్థ రోగులకు ట్రస్ట్‌గా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్ర పరికరాలకు నిధులు, నియామకాలు చేపట్టిందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో నెఫ్రాలజీ హెచ్‌ఒడి డాక్టర్‌ గొంది శివరామకృష్ణ, డాక్టర్‌ నిహారిక, నాట్కో వైస్‌ చైర్మన్‌ నన్నపనేని సదాశివరావు, కో-ఆర్డినేటర్‌ వై.అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.