అరకొరగానే స్కానింగ్ సేవలు
సిబ్బంది కొరతతో రోగుల ఇబ్బందులు
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి
గోదావరి జిల్లాల్లో సుమారు కోటి జనాభాకు ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జిజిహెచ్)కు సమస్యల సుస్తీ చేసింది. పరిష్కారానికి నోచుకోక కష్టాల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వైద్యం కోసం వ్యయప్రయాసలతో వస్తున్న పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందట్లేదు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఆసుపత్రి అభివృద్ధి జరకగపోవడమే దీనిక కారణం. ఫలితంగా కాస్త స్థోమత ఉన్న రోగులు కార్పొరేట్, ప్రయివేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తుండగా.. పేదలు మాత్రం ఇళ్లకు పోయి రోగాలతోనే బాధపడుతున్నారు.
కాకినాడ జిజిహెచ్ దశబ్దాల కాలంగా వైద్య సేవలందిస్తోంది. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విస్తీర్ణం పెరగడమే కాకుండా, జనాభా కూడా ఎంతో పెరిగింది. రోగుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. వారికి తగ్గ అవసరాలు తీర్చడంలో జిజిహెచ్ విఫలమవుతోంది. పెరుగుతన్న అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రి విస్తరణ జరగకపోవడంతో ఒపితో పాటు ఇన్ పేషెంట్లతో కూడా ఆసుపత్రి నిత్యం కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. మెటర్నిటీ వార్డులో అయితే ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు గర్భిణిలు, బాలింతలు, క్షతగాత్రులను ఉంచుతున్న దశ్యాలు ఇక్కడ నిత్యం కనిపిస్తుంటాయి.
మెడికల్, అర్థోపెడిక్ వార్డుల్లో అలాంటి దశ్యాలు అతి సాధారణంగా మారిపోతున్నాయి. మొత్తం 1,069 పడకలుండగా, కీలక వార్డుల్లో పడకల కొరత వేధిస్తోంది. కేవలం ఇన్ పేషెంట్లకు మాత్రమే కాకుండా అత్యవసర విభాగం, ఒపి వద్ద కూడా ఇదే రద్దీ దర్శనమిస్తోంది. ఒపి టికెట్లు తీసుకోవడానికి అరగంట పాటు క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఉంది. ఆ తర్వాత మెడికల్, ఎముకలు వార్డుతో పాటు వారంలో రెండు రోజులు మాత్రమే సాగే న్యూరో, కార్డియాక్ ఒపిల వద్ద రోగుల పడిగాపులు గమనిస్తే పరిస్థితి అర్థమవుతుంది. రోజుకు మూడు వేల మంది వరకూ అవుట్ పేషెంట్లు వస్తుంటే వారికి తగిన వైద్యం అందించే అవకాశం లేదు. ఇక ఖాళీ పోస్టుల కారణంగా రోగులకు అందే సేవలు అతి నామమాత్రంగా మారిపోతున్నాయి. రోగుల తాకిడి ఎక్కువగా కనిపించే సోమ, గురు, శనివారాల్లో వైద్యులు పూర్తిస్థాయిలో వైద్యసేవలను అందించలేకపోతున్నారు. దాంతో సేవల పట్ల సంతృప్తి చెందని చాలామంది ప్రైవేటు వైద్యానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. జిజిహెచ్ చుట్టూ ఉన్న పలు ప్రైవేటు ఆసుపత్రులు నిత్యం రోగులతో కిటకిటలాడుతున్న దశ్యాలు గమనిస్తే ప్రభుత్వ వైద్యం నామమాత్రంగా మారిపోయినట్టుగా అర్థమవుతోంది.
పట్టించుకోని అధికార యంత్రాంగం
అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్న ఆసుపత్రి అభివద్ది విషయంలో అధికార యంత్రాంగం సీతకన్ను వేస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నట్టు పలువురు విమర్శిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది కొరత విపరీతంగా వేధిస్తోంది. ఎఫ్‌ఎన్‌ఒ, ఎంఎన్‌ఒలు కొరతతో రోగులను, క్షతగాత్రులను బంధువులే తీసుకుని వెళుతున్నారు. క్యాజువాలిటీలో 108 వాహన సిబ్బందే వారి పరికరాలతో లోపలికి తీసుకుని వెళుతున్నారు. వైద్యుల నియామకం, ఖాళీ పోస్టుల భర్తీ, మందుల కొరత తీర్చడం వంటి అనేక సమస్యలపై అధికారులు దృష్టి పెడుతున్న దాఖలాలే లేవని రోగులు చెబుతున్నారు.
నామమాత్రంగానే స్కానింగ్ సేవలు
కాకినాడ జిజిహెచ్‌లో ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్ కీలకమైనవి. ఏడాదిగా ఎంఆర్‌ఐ స్కానింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. యంత్రం మరమ్మతులకు గురవడంతో అనేకమంది రోగులు బయట రూ.వేలల్లో ఖర్చు చేసి స్కానింగ్ తీయించుకోవాల్సి వస్తుంది.కొత్త యంత్రం త్వరలో వస్తుందని, ఈ సేవలను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది స్పష్టత లేదు. సిటీ స్కానింగ్ సేవలు సైతం అరకొరగానే అందుతున్నాయి. క్షతగాత్రులకు రిపోర్టులు ఇవ్వడంలో రోజులు తరబడి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వైద్య సేవలు అందించడంలో జాప్యం చోటు చేసుకుంటుంది. మరోవైపు థైరాయిడ్ పరీక్షలు ఇక్కడ నిర్వహించకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తుంది.
స్కానింగ్ రిపోర్టు కోసం తిప్పలు
ఈనెల 14న నా సోదరి కాకాడ రాజేశ్వరికి గొంతులో కాయ ఉండటంతో ఇక్కడే ఆపరేషన్ చేశారు. పరిస్థితి తెలుసుకునేందుకు అదే రోజున సిటీ స్కానింగ్ చేయగా ఐదు రోజులు గడిచినా రిపోర్ట్ ఇవ్వలేదు. స్కానింగ్ విభాగం చుట్టూ తిరుగుతున్నా ఇంకా రిపోర్ట్ రాలేదని సిబ్బంది చెబుతున్నారు.
- అశోక్,రోగి బంధువు, లింగంపర్తి, ఏలేశ్వరం మండలం
స్కానింగ్ కోసం కాళ్లరిగేలా తిరిగా...
గాల్ బ్లేడర్‌లో రాళ్లు ఉన్నాయని, అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకుని రావాల్సిందిగా వైద్యులు తెలిపారు. రెండు రోజులుగా ఎమర్జెన్సీ వార్డు పక్కన ఉన్న ఈ స్కానింగ్ కోసం తిరాగా. ఎవరూ పట్టించుకోవడం లేదు.
- టి.వీర్రాజు,రోగి సామర్లకోట










