ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)లో మాత శిశుసంరక్షణ విభాగం (ఎంసిహెచ్) కోసం ఎన్‌ఆర్‌ఐల సహకారంతో నిర్మిస్తున్న బహుళంతస్తుల భవనంలో మౌలిక వసతులు, వైద్య పరికరాలు, అధునాతన యంత్రాల కొనుగోలుకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇందుకోసం నిధులు ప్రభుత్వం ఇస్తుందా? లేదా? అనే సంశయం అధికారవర్గాల్లో ఏర్పడింది. మాత శిశుసంరక్షణ విభాగం కోసం అధునాతన వసతులతో రూ.80 కోట్లతో 600పడకల సామర్ధ్యంతో ఈ భవన సముదాయం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రూ.80 కోట్లు పూర్తిగా గుంటూరు మెడికల్ కళాశాల పూర్వవిద్యార్థులే (జింఖానా) భరిస్తున్నారు. గైనకాలజీ, ప్రసూతి విభాగం, చిన్న పిల్లల సంరక్షణ, శస్త్రచికిత్సల విభాగం,వివిధ రకాల పరీక్షలు మొత్తం ఈ భవనంలోనే ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న పాత భవనంలో ఉన్న ఈ విభాగంలో గర్బిణీలు సైతం మంచానికి ఇద్దరిని ఉంచుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు సెల్లార్‌తో పాటు మరో ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఈ సముదాయం సిద్ధం అయితే ఆస్పత్రిలో ప్రస్తుతం గర్బిణీలకు కష్టాలు తొలగుతాయని భావిస్తున్నారు.
అయితే ఈ భవనం ఎప్పటికి అందుబాటులోకి తీసుకురాగలరన్న అంశంపై అనేకసందేహాలు నెలకొన్నాయి. నూతన భవన సముదాయంలోకి ఫర్నీచరు, వైద్య పరికరాలు, అధునాతన స్కానింగ్, పరీక్షాయంత్రాలు, ఆపరేషన్ల థియేటర్లు, ఇతర సదుపాయాలకోసం రూ.20 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులు ప్రభుత్వం ఎప్పటికి విడుదల చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంత నిధులు ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాకపోతే నూతనంగా నిర్మించిన ఎంసిహెచ్ భవనం వినియోగంలోకి తేలేమని వైద్యులు, అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి మొత్తం మీద 1600 మంది ఇన్‌పెషెంట్లు ఉన్నారు. కానీ మూడేళ్లక్రితం వరకు ఉన్న లెక్కల ప్రకారం 1200 పడకలే మంజూరయ్యాయి.అధికారికంగా పడకల సంఖ్య పెరగకపోవడంతో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు చాలా తక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 400 మంది అదనంగా ఆస్పత్రిలో నిత్యం ఇన్‌పెషెంట్లుగా చికిత్సలు పొందుతున్నా ఇందుకు తగినంత నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికే ఆస్పత్రిలో అవసరమైన మేరకు మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరుగుతోంది.ఆస్పత్రికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో రావడం లేదు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశుసంరక్షణ కేంద్రభవన సముదాయంలో మౌలిక వసతులకు రూ.20 కోట్లు విడుదల అంశం ప్రశ్నార్ధకంగా మారింది.
ప్రతిపాదనలు పంపార
ఆస్పత్రిలో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశుసంరక్షణ కేంద్ర భవన సముదాయంలో మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు కల్పించేందుకురూ.20 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. మరో నాలుగు నెలల్లో ఐదు అంతస్తుల భవనం నిర్మాణం అప్పగిస్తారని ఈలోగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే అంతర్గత మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామని అన్నారు.