Oct 10,2023 23:47

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా తయారైంది గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో రోగుల పరిస్థితి. ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ పథకాల సమీక్షలో భాగంగా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల్లో ఓపీ విభాగాల్లో రోగుల వివరాలను ఆన్‌లైన్‌ చేయగా ఈ ప్రక్రియ ఒక ప్రహాసనంగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు జిజిహెచ్‌లో పేరు నమోదు చేసుకోవడంలోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో అరగంట నుంచి గంట లోపు ఓపీ చీటి లభించేది. ఇప్పుడు కనీసం రెండు గంటలు పడుతోంది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్‌టిఆర్‌, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. వివరాలు నమోదు పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. మంగళవారం ఆస్పత్రికి ఒకేసారి వేలాది మంది తరలిరావడంతో అధికారులు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల దాటినా క్యూ లైన్లలో రోగుల రద్దీ కన్పించింది. ప్రస్తుతం ఓపీ వేళలను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు కొనసాగిస్తున్నారు.
నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-ఆస్పత్రి విధానం అమలు తరువాత రోగులకు కష్టాలు పెరిగాయి. టోకెన్ల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి రోగి ఆధార్‌, ఫోన్‌ నంబరు, ఇతర వివరాలన్నీ నమోదు చేయాలని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అందుకు తగినన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? అని పరిశీలించలేదు. తొలుత ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆస్పత్రి కౌంటర్‌లో ఓపీ టోకెన్‌ తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. రోగి తన ఫోన్‌ నంబర్లతో రిజిస్ట్రర్‌ చేసుకునే ప్రక్రియతో తీవ్రజాప్యం జరుగుతోంది. ఫోన్‌ నంబరుకు ఒటిపి వచ్చిన తరువాత రోగి వివరాలు నమోదు చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో ఒటిపి రాకపోతే జాప్యం అనివార్యం అవుతోంది. అన్ని వివరాల నమోదైన తరువాతే టోకెన్‌ వస్తుంది. సర్వర్‌ పనిచేయకపోయినా, ఫోన్‌ పని చేయకపోయినా సమస్యలు ఏర్పడుతున్నాయి. చాలినన్న కౌంటర్లు లేవు. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి బయట రోగుల వివరాల నమోదు పని ఇవ్వడం వల్ల ఈ ఏజెన్సీ వారు అనుభవం లేని సిబ్బందిని నియమిస్త్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది ఫోన్లు, ఆధార్‌ కార్డులు లేకుండా వస్తే మరింత ఇబ్బంది పడుతున్నారు. వారంలో నాలుగు రోజుల పాటు రోగుల రద్దీగా ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఓపీల వద్ద ప్రత్యేక చర్యలు : సూపరింటెండెంట్‌
కొత్తగా ఏర్పాటు చేసిన ఓపీ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఓపీ కేంద్రం వద్ద రోగులు వారి సహాయకులు దాదాపు మూడు వేల నుంచి 3500 మంది రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఓపీ కేంద్రంలో ఉన్న ఎనిమిది కంప్యూటర్లు కాకుండా మరో రెండు కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చాం. పాత ఓపీలో కేవలం ఆరు కంప్యూటర్లు మాత్రమే ఉండేవి. వికలాంగుల, వృద్ధులు, పదేపదే ఆస్పత్రికి వచ్చేవారికి (రిపీట్‌) వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. సర్వర్‌ సమస్యలు పరిష్కరిస్తాం. మొత్తం 11 కౌంటర్లు పెడుతున్నాం. ఉదయం 8 గంటలకే కౌంటర్లు ప్రారంభం అవుతాయి. ఆధార్‌ కార్డు, ఫోన్‌లు అందుబాటులో లేనివారికి కూడా ప్రత్యేక కౌంటర్‌ ఉంది.