Nov 02,2023 23:53

ప్రజాశక్తి - అద్దంకి
అవినీతి నిరూపించకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతూ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగు రోడ్డు, అంగల్లు ఘటనలపైనా కేసుపెట్టి వేధించేందుకు ప్రయత్నించారని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. నిన్నటికి నిన్న చంద్రబాబుకు బెయిల్ తధ్యమని తెలియడంతో అప్పటికప్పుడు మద్యం టెండర్లలో ఏదో జరిగిందంటూ కేసు పెట్టి తన శాడిజాన్ని మరోమారు చూపించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ సభల్లో పాల్గొనకూడదని, ప్రెస్ మీట్స్ పెట్టకూడదంటూ హైకోర్టులో పిటిషన్లు వేసి జగన్‌రెడ్డి తన పిరికితనాన్ని బయటపెట్టుకున్నాడని అన్నారు. కేసులు పెట్టడం, నిందలేయడంతప్ప నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబుపై ఒక్క రూపాయికూడా అవినీతి చేశాడని నిరూపించలేకపోయారని అన్నారు. జీవోలిచ్చిన అజేయ కల్లాం 'రెడ్డి'ని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇంత వరకు కనీసం విచారణ కూడా చేయలేదని అన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, జగన్ రెడ్డి మద్యం కుంభకోణాన్ని ప్రజలకు వివరిస్తున్నందుకే తిరిగి మద్యం కుంభకోణాన్ని టిడిపి నేతలపై పెట్టి అణచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఏ కేసులో కూడా ఆధారాలు చూపలేని దౌర్భాగ్య ప్రభుత్వమని అన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతిని అణచివేయడమే లక్ష్యంగా కొల్లు రవీంద్రపై తప్పుడు కేసు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని అన్నారు. నాలుగున్నరేళ్లలో కల్తీ మద్యం అమ్మకాలతో రూ.24వేల కోట్లు దిగమింగిన జగన్ రెడ్డి నిస్సిగ్గుగా టీడీపీపై, చంద్రబాబుపై నిందలేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరాపై జగన్‌రెడ్డి సీబీఐ విచారణ కోరగలడా? అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి రాగానే తన మద్యం దోపిడీకి పనికొస్తాడని ఏరికోరి వాసుదేవరెడ్డిని తెలంగాణ నుండి ఎపికి రప్పించి ఎపి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, డిస్టిలరీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించాడని ఆరోపించారు. కల్తీ మద్యం అమ్ముతూ దాదాపు 40లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేశాడని అన్నారు. 30వేల మంది బలైపోయారని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తా, ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తానని ఊరూరా తిరిగి జగన్‌ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మద్య నిషేధం చేసిన తర్వాతనే 2024ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని ప్రమాణం చేసి మాటతప్పి, మడమతిప్పాడని ఆరోపించారు.