Aug 02,2021 13:41


ప్రజాశక్తి-చిత్తూరు : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 172 తీసుకురావడం దారుణమని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు పద్మ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ... గత నలభై ఐదు సంవత్సరాలుగా అంగన్వాడీలు చేస్తున్న సేవ మరువలేమని అలాంటి ఐసిడిఎస్‌ వ్యవస్థను మరుగు పరిచే విధంగా నూతన విద్యా విధానం తీసుకురావడం దారుణమన్నారు. ప్రాథమిక పాఠశాలకు అనుసంథానం చేయడం వల్ల అంగన్వాడి వ్యవస్థ ఉనికిని కోల్పోతుందని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన ఐసిడిఎస్‌ వ్యవస్థ సేవలు అమోఘం అన్నారు. అలాంటి వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి... నిర్వీర్యం చేయాలని చూస్తోన్న కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడమేంటని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వేతనాలు పెంచాలని, మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తించాలని, అర్హులైన వర్కర్లను సూపర్‌వైజర్‌ పోస్టులతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో పోరాటం చేసి సాధించుకున్న రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సందర్భంలో కూడా తన ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నప్పటికీ గుర్తించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వలన లక్షలాది మంది లబ్ధిదారులకు పౌష్టికాహారం అందకుండా పోతుందని తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య, జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వాణిశ్రీ మాట్లాడుతూ... జిల్లా స్థాయిలో అనేక రకాల సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి... సంవత్సరాల కొద్దీ పెండింగ్‌లో వున్న జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా నాయకులు సుజని, రాజేశ్వరి, శ్యామల, ప్రమీల, సరళ పాల్గని ధర్నాకు సంఘీభావం తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రైతు సంఘం కార్యదర్శి రాజు, కెవిపిఎస్‌ కార్యదర్శులు ఉపాధ్యక్షులు వెంకయ్య, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.