Jul 25,2023 23:33

వినుకొండ: వినుకొండ పురపాలక సంఘ పరిధిలో అభివృద్ధి పనుల కోసం 2019లో ప్రభుత్వం విడుదల చేసిన 146 జీవోకి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని ఖండిస్తూ మంగళ వారం జరిగిన సాధారణ సమావేశంలో టిడిపి కౌన్సిలర్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నుండి వాకౌట్‌ చేశారు. ఫిబ్రవరి 14, 2019న ప్రభుత్వం ప్రకటించిన 146 జీవో ప్రకారం నరసరావుపేట రోడ్డులోని ఎన్‌ఎస్‌పి స్థలంలో అభివృద్ధి నిర్మాణ పనులు జరగాలని కోరారు. స్టేడియం నిర్మించి చుట్టూ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టాలని నాటి కౌన్సిల్‌ తీర్మానం ప్రకారం నిర్మాణం జరగాలని , మునిసిపల్‌ నిధులతో కాకుండా వ్యాపారస్తుల నుండి గుడ్‌విల్‌ తీసుకొని షాపులు నిర్మించి కేటాయించడం వలన సామాన్య,మధ్యతరగతి వ్యాపారులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ఈ విషయమై కమిషనర్‌ వెంకయ్య మాట్లాడుతూ జీవోలో ఉన్న విధంగానే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడతామని, అవసరమైతే పాత జీవోను మార్చి ప్రస్తుత విధానాలకు అనుగుణంగా పనులు జరిపిస్తామని చెప్పారు.
ముందుగా చైర్మన్‌ డాక్టర్‌ దస్తగిరి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో 35 అంశాలతో కూడిన ఎజెండాలో 33 అంశాలు ఏకగ్రీవంగా తీర్మానించి ఆమో దించారు. 17,18 అంశాలకు సంబంధించి డబ్బా స్తంభం సెంటర్‌లో అభివృద్ధి పనులకు టెండర్‌ వేయగా ఒకరే రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రద్దు చేయడం జరిగిందని చైర్మన్‌ దస్తగిరి తెలిపారు.
వినుకొండ పురపాలక సంఘం నూతనంగా ఎన్‌ఎస్‌పి స్థలంలో నిర్మాణం చేపట్టనున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ లో సామాన్య మధ్యతరగతి వ్యాపారులకు అనుకూలంగా గుడ్‌ విల్‌ తీసుకోవాలని, 2019లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన 146 జీవో ప్రకారం అబివృద్ధి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ టిడిపి, సీపీఐ, సిపిఐ ఎంఎల్‌, ఎంఐఎం, బీఎస్పీ తదితర పార్టీ ల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీవీ సురేష్‌ బాబు, షమీంఖాన్‌, బోదాల శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ ఆ జీవోకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.12 లక్షలు గుడ్‌ విల్‌ వసూలు చేయడం సరైన విధానం కాదని అన్నారు. జీవో ప్రకారం పనులు చేపట్టి అందరికీ సమానంగా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ దస్తగిరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.