జీవో నంబర్ 1పై సర్వత్రా నిరసన
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై సర్వత్రా నిరసన మొదలయ్యింది. తీసుకొచ్చిన మరుసటిరోజే చంద్రబాబు పర్యటనపై ఉక్కుపాదం మోపడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. రాజకీయ పక్షాలే కాకుండా ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలు సైతం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన ఈ జీవో నంబర్‌ను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనకు బందోబస్తు నిర్వహించకుండా ఘటనలకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వం, ఈ పర్యటనలనే బూచిగా చూపి జీవో నంబర్ 1 తీసుకొచ్చి ఎక్కడా ర్యాలీలు, సభలు జరపరాదంటూ హకుం జారీ చేసింది. అఖిలపక్షం నేతలు ప్రత్యక్ష ఆందోళనకు దిగి చీకటి జీవోను వెనక్కి తీసుకోవాలంటూ నినదించాయి.
ప్రజాస్వామ్య పద్ధతిలో తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి నిరసన తెలిపే ఏకైక మార్గం ర్యాలీలు, ధర్నాలు, బహిరంగసభలే. అయితే వీటిని అణచివేసేలా జీవో నంబర్ 1 తీసుకొస్తూ తమ జీవో సమర్థనీయమని మంత్రులు, ఎంఎల్‌ఎలు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఈ నేపథ్యంలోనే జీవో తీసుకొచ్చిన మరుసటిరోజే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ హోదాలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. జీవో నంబర్ 1 అమల్లో ఉందని, ఎలాంటి ప్రదర్శనలు చేయరాదని పలమనేరు డిఎస్‌పి ముందస్తు నోటీసులు ఇచ్చి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రచారరథాలను సీజ్ చేసి పోలీసులు తమ ఆధీనంలోనే మూడు రోజులూ ఉంచుకున్నారు. తన సొంత నియోజకవర్గానికి ఎంఎల్‌ఎ రాకూడదా? అని తెలుగు తమ్ముళ్లు వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొని స్వల్ప లాఠీఛార్జి జరిగింది. కుప్పంలో మూడు రోజుల పాటు సాగిన మూడు రోజుల పర్యటన అత్యంత బందోబస్తు మధ్య సాగింది. ముఖ్యంగా వామపక్షాలు అధికార పార్టీ తీరును తప్పుబట్టాయి. ప్రత్యక్ష ఆందోళనకు దిగి జీవో కాపీలను దహనం చేస్తూ నిరసన తెలియజేశారు. ఉద్యోగసంఘాలు మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని, పిఆర్‌సి ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఇస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి వెనక్కి తగ్గారు. ప్రత్యామ్నాయంగా జీపిఎస్ తీసుకొస్తామని చెప్పారు. పేరివిజన్‌లోనూ ఇతర రాష్ట్రాల కంటే దారుణంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీచర్లు, ఉద్యోగులు చలో విజయవాడ నిర్వహించి తమ నిరసన తెలియజేయడంతో ఒక్కసారిగా అధికార పార్టీ ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన చంద్రబాబు పర్యటలను సాకుగా చూపి ప్రతిపక్షాల, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల గొంతు నొక్కేలా జీవో నంబర్ 1 తీసుకొచ్చి విమర్శలను మూటగట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో తమ స్పందన ఏంటో ఎన్నికల్లో చూపిస్తామని, జగన్మోహన్‌రెడ్డి ఒంటెద్దుపోకడతో తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని ముక్తకంఠంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.










