ప్రజాశక్తి- మంగళగిరి:మోటారు వాహనాల చట్ట సవరణ జిఓ నెంబర్ 21ను వెంటనే రద్దుచేయాలని ఏఐఆర్‌టిడబ్య్లూఎఫ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్ చెంగయ్య లు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని టిప్పర్ల బజారు సిఐటియు కార్యాలయంలో లక్ష్మీనరసింహ టాటా మ్యాజిక్ యూనియన్ మహాసభ కొండలు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన శివాజీ, చెంగయ్యలు మాట్లాడుతూ మోటార్ వాహనాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో పెంచిన ఫీజులు, పెనాల్టీలు పెట్రోల్, డీజిల్ ,గ్యాస్, ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కు కింద మార్చాలని ప్రతిపాదన ఉపసమరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో రైతులు పండించిన పంటలు, పండ్లు కూరగాయలు, మత్స్య ఉత్పత్తులు , నిత్యావసర సరుకులు ప్రయాణికులను చేరవేసే మోటారు వాహన రంగాన్ని ప్రభుత్వం నీరుగారుస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నూతన చట్టాల వల్ల ఉపాధి కోలిపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే మోటార్ వాహనాలపై టోల్ టాక్స్‌లు, రోడ్ టాక్స్‌లు, అధిక పెనాల్టీలు, గ్రీన్ టాక్స్ పెరిగాయన్నారు. ఇప్పుడు 15ఏళ్లు దాటిని వాహనాలను తీసివేయాలనే ప్రతిపాదన వలన దేశంలో రెండు కోట్లకు పైగా రావణా కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్ట సవరణ జిఓ నెంబర్ 21ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులు గట్టెం నవీన్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ. ఉపాధ్యక్షులు ఎస్‌కె.సత్తార్, కోశాధికారి ఆర్ హనుమంతురావులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.










