ప్రజాశక్తి-దత్తిరాజేరు : చిన్నచామలాపల్లిలో గొర్రెలు, మేకల పెంపకందారులకు జీవనాధారమైన భూములను కృషి విజ్ఞాన కేంద్రం కోసం లాక్కోవద్దని కోరుతూ శనివారం మానాపురం సంతతోట వద్ద జాతీయ రహదారిపై సిపిఎం ఆధ్వర్యాన రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు చిన్నచామలాపల్లిలో గొర్రెలు, మేకలు పెంపకంపై ఆధారపడిన కొండ భూమిని లాక్కోవడం జీవాలను చంపడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నిర్ణయం వృత్తిదారుల జీవనం తుంగలో తొక్కడమేనని, జీవించే హక్కుని హరించి వేయడమేనని చెప్పారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం భూమిని సేకరించిందని, ఆ భూముల్లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆటంకమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కంపెనీలకు ఇచ్చేసి మూగజీవాల భూములు లాక్కోవడం సిగ్గుచేటన్నారు. చుట్టూ ఉన్న అనేక ప్రాంతాల్లో సేకరించిన ప్రభుత్వ భూముల్లో కెవికె ఏర్పాటుకు సిద్ధం కావాలి తప్ప చిన్నచామలాపల్లి కొండ భూమికి వస్తే వృత్తిదారులు ఊరుకోరని హెచ్చరించారు.
ఈ విషయంపై ఇప్పటికే తహశీల్దార్, ఆర్‌డిఒ, కలెక్టర్‌కు వినతులు అందజేసినా, మొండిగా భూమి సేకరణకు సిద్ధం కావడం చాలా దుర్మార్గమని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెంపకందారులకు సిపిఎం అండగా నిలుస్తుందని స్పష్టంచేశారు. వీరికి అన్ని పార్టీలు మద్దతు తెలియజేసి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.శ్రీనివాస్, రాకోటి రాములు, రాము, దుర్గాప్రసాద్, హర్ష, మాజీ ఎంపిటిసి ఎం.ఎరుకునాయుడు, తిరుపతిరావు, శంకరరావు, లక్ష్మణ, మహేష్, తదితరులు పాల్గొన్నారు.