
నవ్యాంధ్రకు జీవనాడిగా అభివర్ణించే పోలవరం ప్రాజెక్టుపై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. ఈ మధ్యనే కేంద్ర జలశక్తి మంత్రి ప్రాజెక్టును సందర్శించి పూర్తి బాధ్యత కేంద్రానిదేనని ఢంకా భజాయించారు. ఇంకోవైపు పార్లమెంట్‌లో నిర్వాసితుల బాధ్యత తమది కాదని రెండు నాల్కల నీతి ప్రదర్శించారు. ఈ అయోమయం కొనసాగుతుండగానే కొత్తగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని అసలుకే యాతం తెచ్చారు. మొన్న మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్వయాన ముఖ్యమంత్రే కలగజేసుకొని 2023 ఖరీఫ్‌కు పోలవరం పూర్తవుతుందని ఘంటాపథంగా ప్రకటించారు. నెల తిరిగేలోగా ప్రాజెక్టు ఎప్పుడవుతుందో తెలీదని తమ సిఎం చేసిన ప్రకటనను మంత్రి కాదనడం విడ్డూరం కాక మరేంటి? డయాఫ్రం వాల్ దెబ్బతిన్నందున ప్రాజెక్టు ప్రశ్నార్ధకమైందన్నది మంత్రి వల్లెవేత. కేంద్రం నుండి నిపుణుల కమిటీ వచ్చి పరిశీలించాక భవిష్యత్ తేలుతుందన్నది ఏతావాతా ప్రభుత్వం మదిలోని మాట. జులై నుండి గోదావరికి వరదలొస్తాయి కాబట్టి ఈ ఏటా పనులు జరగకపోవచ్చు.
గోదావరికి 2020 మార్చిలో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు గుర్తించామని సర్కారు ఒప్పుకుంది. మరి అప్పటి నుండి ఏం చర్యలు చేపట్టిందో మాత్రం వెల్లడించలేదు. రెండేళ్లు రహస్యంగా ఎందుకుంచారో, నిపుణుల కమిటీ కోసం ఇన్నేళ్లు ఎదురు చూడటమేంటో అస్సలు అర్థం కాదు. జాతీయ ప్రాజెక్టు నిర్మాణం దెబ్బతిన్నదని సమాచారం ఇచ్చినా ఎందుకు కేంద్రం స్పందించలేదో నరమానవుడికి అంతుబట్టని వ్యవహారం. పద్ధతి పాడు లేకుండా టిడిపి ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టడం వలన ప్రాజెక్టు ప్రశ్నార్ధకం అయిందని ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. స్పిల్ వే, స్పిల్ చానల్, క్రస్ట్ గేట్లు, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, డయాఫ్రం వాల్ ఈ డిజైన్లన్నింటికీ సిడబ్ల్యుసి, టెక్నికల్ కమిటీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలు ఆమోదం తెలిపాయి. ఒక వేళ టిడిపి అజ్ఞానంతో చేపట్టి ఉంటే వాటికి అనుమతులిచ్చిన కేంద్ర సంస్థలదీ అజ్ఞానమే కావాలి. నిజంగా వైసిపి ప్రభుత్వం తప్పులను నిర్ధారించదలిస్తే టిడిపితో పాటు కేంద్ర బిజెపిని బోనులో నిలబెట్టవచ్చు. ప్రభుత్వం వద్ద సమాచారం అంతా ఉంటుంది. కేవలం ఒకరినే దోషిగా చూపించడం అంటే అసలు దోషిని వెనకేసుకు వచ్చినట్లే.. వైసిపి ఎంచుకున్న ఈ వైఖరి కేంద్ర బిజెపి పట్ల రాజీ ధోరిణిని తెలుపుతుంది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు నష్టదాయకం.
నీళ్లలో మునిగి ఉండే డయాఫ్రంవాల్ పరిస్థితిని అంచనా వేయాలంటే నీటిని తోడిపోయాలి. రూ.2,100 కోట్లు ఖర్చవుతుంది. డ్రెడ్జింగ్‌కైతే రూ.800 కోట్లవుతుంది. ఈ వ్యయం ప్రాజెక్టు అంచనాకు అదనం. కేంద్రం ఒప్పుకుంటుందో లేదో అనుమానమే. 2017-18 ధరలకనుగుణంగా నిర్దేశిత పోలవరం పూర్తి కావాలంటే రూ.55 వేల కోట్లు కావాలి. నిర్వాసితులకు రూ.33 వేల కోట్లవుతుంది. 2013-14 ధరలనుబట్టే నిధులిస్తామని కేంద్రం మడతపేచీ పెట్టింది. అదే పక్కా అయితే ఇప్పటికి ఖర్చయిన రూ.20 వేల కోట్లతో సరిపెట్టుకోవాల్సిందే. ఈ కీలకాంశంపై గతంలో టిడిపి, ప్రస్తుత వైసిపి నోరు మెదపవు. తాజాగా ఎత్తు తగ్గింపు 'ఎత్తు' తెరమీదికి తెచ్చారు. ప్రతిపాదిత 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించి, తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకే నీళ్లు నిలబెడతామంటున్నారు. ఇది నిర్వాసితులైన లక్ష ఆదివాసీ కుంటుంబాలను దగా చేసే కుట్ర. అంతర్జాతీయ చట్టాలు సైతం ఏ ప్రాజెక్టునైనా నిర్వాసితులకు సహాయ, పునరావాసం కల్పించాకే చేపట్టాలని ఘోషిస్తున్నాయి. పోలవరంలో 373 ఆవాసాలు, లక్ష ఎకరాలను త్యాగం చేసిన త్యాగధనులను పాలకులు అనాథలు చేస్తున్నారు. ముందు నిర్మాణాలు చేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టే రంధే పరమావధి అయింది. ఇప్పటికే కొద్దిపాటి వరదలొచ్చినా ఊళ్లకు ఊళ్లు మునుగుతున్నాయి. నాలుగు శాతం కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలో ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు కాలేదు. పూర్తి వాస్తవాలను వెల్లడించి, అసలు దోషులను ప్రజల ముందు నిలబెట్టేందుకు ఉన్నతస్థాయి విచారణ జరపాలి. ప్రాజెక్టును ఒకే దశగా నిర్వాసితుల పునరావాస, పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలి.