
* రాష్ట్రంలో అవినీతిరహిత పాలన
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
* 23న సిఎం చేతుల మీదుగా కిడ్నీ ఆస్పత్రి ప్రారంభం
* పలాసలో సామాజిక సాధికార బస్సు యాత్ర
ప్రజాశక్తి - పలాస: మారుతున్న జీవన ప్రమాణాలే అభివృద్ధి సూచీలు అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్ర కాశీబుగ్గలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒక కార్యక్రమాన్ని మొదలుపెడితే మూడు ప్రభుత్వాలు మారితే గానీ పూర్తి కాని పరిస్థితి ఉండేదన్నారు. కిడ్నీ రోగుల సమస్యలు తీర్చడానికి, వంశధార ప్రాజెక్టు నుంచి తాగునీరు అందించడానికి వైసిపి ప్రభుత్వ కాలంలోనే అనుకుని పూర్తి కూడా చేశామన్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలే కాదని ప్రజల జీవన ప్రమాణాలు ఏమేరకు పెంచాలనే ఆలోచన అని అన్నారు. అందుకోసం తీసుకొచ్చిన మార్పులు ఓట్ల కోసం కాదన్నారు. పిల్లలకు చదువు చెప్పడం ఓట్ల కోసం కాదని, విద్య ద్వారా పేదరికం తొలగించే పని అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల పేరుతో రూ.2.30 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వైసిపి ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజలకు పథకాల డబ్బులు పంచేస్తోందని గుండెలు బాదుకున్న చంద్రబాబు నాయుడు, తాను అధికారంలోకి వస్తే అంతకంటే ఎక్కువ పథకాలను అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్దాన ప్రాంత కిడ్నీ రోగుల కోసం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. పాదయాత్ర సమయంలో ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసుకున్న జగన్ పలాసలో కిడ్నీ ఆస్పత్రి, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడమే కాకుండా, ఈనెల 23న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుందన్నారు. జిల్లాకు చెందిన ప్రతిపక్ష పాలకులు వారి హయాంలో ఉద్దాన ప్రాంతానికి తాగునీరు ఇచ్చారా...? ఆసుపత్రి కట్టించారా...? ఒక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 23 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇస్తే జిల్లాకు రెండు సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అప్పటి పాలకులు ఒక్క సంస్థనైనా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వం ఆంగ్ల విద్యపై దృష్టిసారిస్తే చంద్రబాబు నాయుడు మాతృభాషను కించపరుస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, టిడిపి నేతల పిల్లలు మాత్రం విదేశాల్లో ఆంగ్లంలో ఎలా చదివిస్తున్నారని ప్రశ్నించారు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఆంగ్లం నేర్చుకుంటే ప్రపంచ దేశాల్లో ఉన్నతావకాశాలు లభిస్తాయని చెప్పారు.
జిల్లాలో వలసల నివారణకు రూ.4,500 కోట్ల వ్యయంతో చేపడుతున్న మూలపేట పోర్టు నిర్మాణం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. వరి పంటకు సాగునీరు లేదని, సకాలంలో వర్షాలు కురకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం అందిస్తామన్నారు. రూ.700 కోట్ల వ్యయంతో ఉద్దాన ప్రాంతానికి ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. గౌతు, కింజరాపు కుటుంబాలు ఏళ్ల తరబడి జిల్లాలో రాజకీయాలు చేస్తున్నారని, జిల్లాకు ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ముందుగా కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసిపి ఉత్తరాంధ్ర సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్ కుమార్, వి.కళావతి, కంబాల జోగులు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పేరాడ తిలక్, మామిడి శ్రీకాంత్, దువ్వాడ వాణి తదితరులు పాల్గొన్నారు.