Sep 26,2021 07:17

జీవితమంటే అంతులేని ఒక పోరాటం. ఆదిమ సమాజం నుండి నేటి ఆధునిక సమాజం వరకు... పోరాటాలు మనషి జీవితంలో విడదీయలేని ఒక భాగం. ప్రకృతితో పోరాడితేనే మానవుడు ఆదిమానవుడి దశ నుండి ఆధునికత వైపు అడుగులు వేయగలిగాడు. శాస్త్రజ్ఞులు చేసే పరిశోధనలు సైతం ఒక పోరాటమే. తన పరిశోధనలో విజయం సాధించడం కోసం తన శక్తినంతా కూడదీసుకొని పోరాడతాడు... తన విజ్ఞానాన్నంతా ధారపోస్తాడు. అలాంటి పోరాటాల ఫలితమే మనం అనుభవిస్తోన్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. నేడు మనల్ని కరోనా బారి నుంచి రక్షించిన వ్యాక్సిన్లు సైతం శాస్త్రవేత్తల పోరాట ఫలితమే. మనం తినే ప్రతి మెతుకూ ప్రకృతితో రైతు సాగించే పోరాటమే. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రైతు విజయం సాధించకపోతే... ఈ ప్రపంచమే ఆకలితో అలమటించిపోతుంది. నేడు మనం అనుభవిస్తోన్న స్వాతంత్య్రం కూడా పోరాటాల ఫలితమే. లేదంటే ఆంగ్లేయులకో, వారికంటే బలవంతులకో బానిసలుగానే వుండేవారం. తల్లి కూడా తొమ్మిది నెలలు మోసిన తర్వాతనే బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ కడుపున పడిన దగ్గర నుంచి ప్రసవం వరకూ తల్లి ఓరిమి కూడా ఓ పోరాటమే. 'జీవితమంటే పోరాటం/ పోరాటంలో ఉంది జయం/ ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢకొీట్టు/ గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు' అంటాడో సినీకవి. పోరాటం మనిషి ఉనికిని ఉన్నతీకరిస్తుంది... సంస్కరిస్తుంది... సజీవంగా నిలుపుతుంది.
అధికారంలో వున్నవారు అసలు ఈ పోరాటాలు మానవ సహజమైనవి కాదన్నట్లుగా వాదనలు చేస్తుంటారు. ప్రజలకు ఏమైనా చేయాలంటే మేమే చేస్తాం తప్ప... మీరు పోరాటాలు చేయాల్సిన అవసరం ఏముందని వాదిస్తుంటారు. పోరాటాలు చేయడం నిషిద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ... అధికారంలోకి రాకముందు చెప్పే కబుర్లు, చేసే వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని, నిరుద్యోగాన్ని పారదోలతామని,. మేము గెలిస్తే... విదేశాల్లో దాచిన నల్లడబ్బును తెచ్చి మీ ఖాతాలో జమ చేస్తామని చెబుతారు. మరి చేసిన వాగ్ధానాలను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? తమ ప్రయోజనాలను కాపాడతారనే అధికారం అప్పగిస్తారు ప్రజలు. ఆ ప్రజలనే మర్చిపోయి... చేసిన వాగ్దానాలను విస్మరించి.. తమను ఎవరూ విమర్శించకూడదని, విమర్శిస్తే, పోరాటాలు చేస్తే... దేశానికి చెడ్డపేరు వస్తుందని సాకులు చెప్పే నయవంచకులను ఏమనాలి? ప్రజాస్వామ్య దేశంలో పాలకులు ప్రజానుకూలంగా వ్యవహరించకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు. నిలదీస్తారు... పోరాటాలు చేస్తారు. ఆ పోరాటాలను వ్యతిరేకించడమంటే... మనుషులను జంతువుల స్థాయికి దిగజార్చడమే. 'మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మగమేరా/ మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా' అని ఓ కవి చెబుతాడు. మనిషి ప్రతి దశలోనూ ఇటువంటి మగాలతో, అసురులతో పోరాడుతూనే ఎదిగాడు. పోరాడుతూనే వుంటాడు. ఇది సహించలేకనే మీరెందుకు పోరాటాలు చేస్తున్నారు? మీ పోరాటాలు వధా అంటూ నిందలు వేస్తుంటారు పాలకులు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపైనే విమర్శలు ఎక్కుపెట్టేవారు... పోరాటాలు వధా అని చెప్పేవారు... ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా చరిత్రలో నిలిచిపోతారు.
ప్రభుత్వాలు చేస్తున్నవన్నీ సరైనవే అయితే.. ఫలితాలు ఎందుకు రావడంలేదు. ప్రజలు ఎందుకు ఉద్యమాలవైపు నడుస్తున్నారు? ప్రజలు తమ కనీస అవసరాలకోసం కూడా పోరాడాల్సి వస్తోందంటే... ఆ ప్రభుత్వం విఫలమైనట్లే. తమ హక్కులను సాధించుకోవాలంటే.... ప్రజలకు వున్న మార్గం పోరాటం. అందుకే ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నేడు అధికార పీఠంపై కూర్చొని పోరాటాలను విమర్శిస్తున్నవారంతా... నాటి జాతీయోద్యమ పోరాటమే లేకుంటే ఈరోజు అధికారంలో తాము కూర్చొనే అవకాశమే లేదనే విషయం మర్చిపోతున్నారు. తమ అస్తిత్వం కోసం, హక్కుల కోసం, అవిద్య అజ్ఞానం మీద, నియంతత్వం మీద నిరంతరం పోరాటం జరగాలి. పోరాటంతోనే ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతాం. పోరాటాన్ని వ్యతిరేకించేవాడు.... సమాజ వికాసానికి విధ్వంసకుడు. 'జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా... జంకుబొంకు లేక ముందు సాగిపొమ్మురా...' అంటూ ఎన్ని అడ్డంకులెదురైనా పోరాటాల వైపు... సమాజ వికాసం వైపు సాగిపోవాల్సిందే. 'ఎఱుకలేని దొరల నెన్నాళ్లు కొలిచిన/ బ్రతుకు లేదు వట్టి భ్రాంతిగాని' అన్న వివేకంతో ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు చరమగీతం పాడాల్సిందే. 'పోరాడితే పోయేదేం లేదు... బానిస సంకెళ్లు తప్ప' అన్న మార్క్స్‌ మాటలు శ్రమ దోపిడీ సంకెళ్ల బంధనాల్లో చిక్కుకున్న సంపద సృష్టికర్తలందరికీ శిరోధార్యం.