Apr 25,2021 12:20

'వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు.. ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు' అని చెప్పిన మన న్యాయవ్యవస్థే.. ఆ న్యాయం చేయడం ఆలస్యం చేస్తే అన్యాయం చేసినట్టే అనీ చెప్తుంది. అయితే చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న నిర్దోషులు మన దేశంలో అనేకమంది. జీవితంలో ముఖ్యమైన దశ అంతా శిక్షగా అనుభవించేశాక.. ఇంటరాగేషన్‌ పేరుతో ఒంట్లో ఉన్న శక్తినంతా లాగేశాక.. చివరికి జీవచ్ఛవాల్లా ఉన్న వారిని నిర్దోషులుగా విడుదల చేయడం పరిపాటి. సమయం చాలా విలువైనది. అయితే జీవితంలో గడిచిపోయిన సమయంలో ప్రతి నిమిషమూ వెలకట్టలేనిది.. ఒకవేళ వెనక్కి తిరిగి ఇవ్వాల్సి వస్తే.. దాన్ని తిరిగివ్వడం ఎవరివల్లా కాదు.. మరి అన్నేళ్ల శిక్ష అనుభవించాక నిర్దోషులుగా ప్రకటించి, విడుదల చేస్తున్నారు. మరి వారి జీవితాలకు బాధ్యులు ఎవరు? ఈ తప్పుడు ఆరోపణకు మూల్యం ఎవరు చెల్లిస్తారు? చుట్టుపక్కల సమాజంలో, బంధువుల్లో చెడ్డవారిగా ముద్రపడితే?, దాన్ని తుడిచేయడం సాధ్యమా? జరిగిన నష్టం కోలుకోలేనిది. దీనికి నష్టపరిహారం ఉందా? ఇచ్చినా వారి జీవితం తిరిగి వస్తుందా? వారి జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు..? దీనిమీదే ఈ కథనం.. చదవండి..

సుదీర్ఘ విచారణ, ఉగ్రవాదిగా ముద్ర వేయటం మామూలుగా జరిగిపోతుంది. దీనివల్ల నిర్దోషులైన సామాజిక కార్యకర్తలు, వైద్యులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు సామాజికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలా నిర్దోషిగా ప్రకటించిన కొద్దిరోజుల తరువాత బాధితుల్లో ఒకరైన మహ్మద్‌ అబ్దుల్‌ హై ఇలా స్పందించారు. 'నా 30 ఏళ్ల జీవితం అరెస్టు తర్వాత నాశనమైంది. నాకు వచ్చే ప్రతి ప్రమోషన్‌ రద్దు చేశారు. నేను 2015లో జెఎన్‌వి విశ్వవిద్యాలయం (రాజస్థాన్‌లోని జోద్పూర్‌లో) నుంచి ఇంకా నా గ్రాట్యుటీ పొందలేదు. కేసు కారణంగా నా ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం జైపూర్‌లో ఉంటున్నాను. మైనారిటీల విద్యపై సదస్సులో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలను ఆహ్వానించారు. ఇది ఏవిధమైన రహస్య సమావేశం కాదు. వాస్తవానికి, ముగ్గురు వైస్‌ ఛాన్సలర్లు ఈ సమావేశంలో భాగంగా ఉన్నారు.' అని బిజినెస్‌ అండ్‌ ఫైనాన్స్‌ అధ్యాపకులు, పుస్తక రచయిత మహ్మద్‌ అబ్దుల్‌ హై వాపోయారు. ఈయన అనేక పరిశ్రమలకు సలహాదారుగానూ పనిచేశారు. అరెస్టు తర్వాత తనను నాన్‌-ఎంటిటీగా తగ్గించారని వాపోయారు.

బాధితుల్లో అహ్మదాబాద్‌ నివాసి, ఔత్సాహిక జర్నలిస్ట్‌ ఆసిఫ్‌ షేక్‌ మరొకరు. గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడు. సెమినార్‌కి ప్రతినిధిగా హాజరయ్యాడు. చేయని నేరానికి ఆసిఫ్‌ షేక్‌ను అరెస్టు చేసి, కొట్టి, 14 రోజుల కస్టడీలో ఉంచినట్లు అతని న్యాయవాది చెబుతున్నారు. 'అతను ఉద్యోగం పొందలేకపోవడంతో అతని జీవితం దెబ్బతినిపోయింది. అరెస్టు కారణంగా కుటుంబసభ్యులు, బంధువులు ఆయన నుంచి దూరమయ్యారు. ఏ ఉద్యోగానికి వెళ్లినా కేసు గురించి తెలియగానే సంబంధిత యజమానులు వెళ్లిపోమంటున్నారు. చివరికి సుగంధ ద్రవ్యాలు అమ్మే ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. పోలీసుల వేధింపులు అతని జీవితంలో రోజువారీ భాగం. మత సంఘటన జరిగిన ప్రతిసారీ, పోలీసులు అతని ఇంటికొచ్చి వేధించే, విచారణ ప్రారంభిస్తారు' అని ఆసిఫ్‌ తరపు న్యాయవాది తెలిపారు.

జీవితాన్ని ఎవరిస్తారు?


దేశ వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) లోని వివిధ నిబంధనల ప్రకారం అఖిల భారత మైనారిటీ విద్యామండలి నిర్వహించిన సెమినార్‌లో పాల్గొన్న 127 మందిని 2001 డిసెంబర్‌లో సూరత్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిషేధించబడిన స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) కార్యకలాపాలు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేవిగా ఉన్నాయని ఆరోపించారు. అయితే 2021 మార్చి మొదటివారంలో 19 ఏళ్ల తర్వాత, సూరత్‌లోని చీఫ్‌ జ్యూడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అక్షర్ధామ్‌ ఆలయ ఉగ్రవాద దాడి కేసు (2002), ధౌలా కువాన్‌ కేసు (2005) లోనూ చాలా ఏళ్లు జైలుశిక్ష అనంతరం నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ, వరుస తీర్పులు అనేకమంది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని అర్థమవుతుంది. ఇలాగే మరికొన్ని కేసుల్లో అనేకమంది నిర్దోషులు శిక్ష అనుభవిస్తున్నారనే విషయాన్ని తేటతెల్లం చేస్తోన్నాయి.

ఇటీవల విడుదలైన 'నాంది' చిత్రం కూడా ఇటువంటి కథాంశంతోనే వచ్చింది. ఓ నిర్దోషిని తనకు ఎటువంటి సబంధమూ లేని కేసులో ఇరికించడంతో కథ మొదలవుతుంది. అయితే నిర్దోషిని కేసులో ఎందుకు ఇరికిస్తారు.. అతడిని దోషిగా నిర్దారించడానికి ఎలాంటి కుట్రలు పన్నుతారు...చివరికి అతడు ఎలా నిర్దోషిగా బయటపడతాడు. జైలు కెళ్లిన తర్వాత అతని జీవితంలో ఎలాంటా మార్పులు చోటుచేసుకుంటాయి. వంటి అంశాలను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఇదేదో సినిమాకే పరిమితమవుతుందనుకుంటే పొరపాటే.. ప్రస్తుత సమాజంలో అనేకమంది నిజజీవితాలకు అద్దంపడుతుంది. వారి జీవితాల్లోకి ఓసారి తొంగిచూస్తే.. ఇలాంటి కథలు కోకొల్లలు.. సినిమా చూసినంత సేపూ ఇది అన్యాయం... హీరోకి అన్యాయం జరిగిందని భావించే సదరు ప్రేక్షకులెందరో... నిజజీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఆలోచనా విధానం మారుతుంది. ఫలితంగా నిర్దోషులైన వారి జీవితాల్లో చెరగని ముద్రవేస్తుంటారు..

2005లో ధౌలా కువాన్‌ ఎన్‌కౌంటర్‌..
పాలం విమానాశ్రయంలో బాంబులు వేయడానికి కాశ్మీరీ ఉగ్రవాదులు చేసిన ప్రణాళికలో తాము విఫలమయ్యామని, ఆరుగురు కాశ్మీరీ యువకులను భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత అరెస్టు చేశామని ఢిిల్లీ పోలీసులు ప్రగల్భాలు పలికారు. సెషన్స్‌ కోర్టు 2011లో ఆరుగురినీ నిర్దోషులుగా ప్రకటించింది. 'పోలీసులు చెప్పినట్లు ఎన్‌కౌంటర్‌ జరగలేదు. కానీ ఆ పరిస్థితిని సృష్టించారు. ఒక వ్యక్తిని యుఎపిఎ కింద అరెస్టు చేసి, తరువాత నిర్దోషిగా తేలితే, సంబంధిత పోలీసులను జవాబుదారీగా ఉంచినప్పుడు అతనికి కొంత పరిహారం ఇస్తే అది పోలీసులు తప్పు చేయకుండా అరికట్టగలదు.' అని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు.

యుఎపిఎ రాజ్యాంగ విరుద్ధం : మహారాష్ట్ర మాజీ ఐజి ముష్రిఫ్‌
ఉగ్రవాద ముప్పును పరిష్కరించడానికి ప్రస్తుత చట్టాల్లో తగినన్ని నిబంధనలు ఉన్నాయి. 'హూ కిల్డ్‌ కర్కరే', 'బ్రాహ్మణిస్ట్స్‌ బాంబ్డ్‌', 'ముస్లిమ్స్‌ హ్యాంగ్డ్‌' పుస్తకాల రచయిత ముష్రిఫ్‌. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2014 నుండి దాదాపు 65 శాతం అంటే రెండు వేల 'దేశద్రోహ' కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి భారతీయులు దేశద్రోహులు అవుతున్నారా? లేదా ప్రభుత్వం మరింత శిక్షార్హంగా మారుతుందా? అనే సందేహం తలెత్తుతుంది. యుఎపిఎను ఉపయోగించడంలో ప్రభుత్వం మరింత శిక్షార్హంగా మారుతోంది. అయితే దేశద్రోహానికి సంబంధించి సరైన నిర్వచనం ఇవ్వలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే అసమ్మతి స్వరాలన్నీ దేశద్రోహంగా పరిగణించబడుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు ప్రజాస్వామ్యంలో ఒక హక్కు. సోషల్‌ మీడియా, బహిరంగ ప్రసంగం సామాన్యులకు వ్యక్తీకరణ సాధనాలు.

జీవితాన్ని ఎవరిస్తారు?


భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని దిగజార్చడంపై స్వీడన్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్వతంత్ర పరిశోధనా సంస్థ వి-డెం ఇనిస్టిట్యూట్‌ ఇటీవల నివేదికను ప్రచురించింది. 2017 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై రాజ్యాంగ విధానాన్ని ఈ నివేదిక సూచించింది. భారతదేశం ప్రజాస్వామ్య హోదాను కోల్పోయే అంచున ఉందని నివేదిక పేర్కొంది.

భీమా కోరెగావ్‌, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం నిరసనల వెలుగులో, యుఎపిఎ కింద ఏకపక్ష అరెస్టులు జరిగాయి. చాలామంది ప్రొఫెసర్లు, విద్యార్థులు, కవులు చాలా కాలంగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అయితే వీటి లక్ష్యం సామాన్యులను, మైనారిటీలను, ప్రధానంగా ముస్లింలను భయపెట్టడం. ఏదైనా అరెస్టు అంటే సమాజానికి పెద్ద సందేశం పంపడం. అయితే, రాజ్యాంగం పరిశీలనకు చట్టం నిలబడదు. దీనిని న్యాయస్థానంలో తీవ్రంగా సవాలు చేయలేదు. లౌకికవాదుల యొక్క ముఖ్యమైన సంస్థ దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేయాలి.

తప్పేంటి?
బెయిల్‌ కోసం ఎటువంటి నిబంధనలూ లేవు. రిమాండ్‌ కోసం నిందితుడిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచినప్పుడల్లా తన ముందుం చిన వాటిని సాక్ష్యంగా పరిగణిస్తారు. నిందితులు పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు బలవంతంగా ఒప్పించడం, తప్పుడు సాక్ష్యాలు చెప్పించడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. అయితే పంచనామ అనగా కొంతమంది సమక్షంలో, పోలీసులు కొన్ని సందర్భాల్లో పరిశోధనా విభాగం పేలుడు, ఉర్దూ సాహిత్యాన్ని కూడా చూపిస్తారు. వారు ఉర్దూ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని అభ్యంతరకరంగా భావిస్తారు. దీనిని జిహాదీ పదార్థంగా భావిస్తారు. అదే కోర్టు ముందు ప్రదర్శిస్తారు. మేజిస్ట్రేట్‌, దానిని ధృవీకరించకుండా, పోలీసు కస్టడీకి ఆదేశిస్తారు. కేసు హైకోర్టుకు వెళ్ళినప్పుడు, దానికి చట్టంలో ఎటువంటి నిబంధనలూ లేనందున అది బెయిల్‌ ఇవ్వదు.

కోర్టులో సవాలు చేయాలి!
పోలీసు కస్టడీ మంజూరు చేసే ముందు కొంత ప్రాథమిక విచారణ జరిపించాలని మేజిస్ట్రేట్‌ను ఆదేశించాలని కోర్టును అభ్యర్ధించాలి. ఒక పోలీసు అధికారి ముందు నిందితుడు వాంగ్మూలం ఇచ్చినట్లయితే. దానిని సువార్త సత్యంగా అంగీకరించే బదులు, మేజిస్ట్రేట్‌ అతన్ని తన గదిలోకి పిలిచి, ప్రశ్నించవచ్చు.. అతనిని నమ్మకంగా తీసుకోవచ్చు.. అతను స్టేట్మెంట్‌ ఇచ్చాడా లేదా అని నిర్ధారించుకోవచ్చు. అదేవిధంగా సాక్షులను కూడా ప్రశ్నించాలి. ప్రాథమిక విచారణకు ఒక మార్గం ఉండాలి. లేకపోతే, ఏళ్ల తరబడి నిందితులు కస్టడీలోనే ఉంటారు.

నిందితులపై ఎటువంటి ఆధారాలూ లేవని చాలా ఏళ్ల తర్వాత కోర్టు కనుగొన్న 21 కేసుల గురించి మాజీ ఐజి ముష్రిఫ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ జరిగి ఉంటే, అలాంటి పరిస్థితిని నివారించవచ్చు. ఉదాహరణకు, 2002 అక్షర్ధామ్‌ ఆలయ ఉగ్రవాద దాడి కేసులో, సుప్రీం కోర్టు 2014 మేలో దిగువకోర్టు దోషులుగా తేలిన ఆరుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. అమాయకులను మోసం చేసినందుకు గుజరాత్‌ పోలీసులను మందలించింది.

ఏళ్ల తరబడి వేచి ఉండటం సరైనదా?
చాలా సందర్భాల్లో నిందితుడికి మంచి న్యాయవాది అందుబాటులో ఉండరు. ఇలాంటి కేసులతో పోరాడటానికి చాలామంది సన్నద్ధం కారు. న్యాయవాదులు వాటిని సాధారణ కేసులుగా పరిగణిస్తారు. అయితే అలాంటి సందర్భాల్లో దర్యాప్తూ ఒక కుట్రే. కొన్ని సందర్భాల్లో నిజమైన నేరస్థులను తెలుసుకున్న తర్వాతా, పోలీసులు ఆ ఆధారాలను అనుసరించే బదులు, కొన్ని తప్పుడు సాక్ష్యాలు, బలవంతపు వాంగ్మూలం ఆధారంగా అమాయకులు, ఎక్కువగా మైనార్టీల్ని కేసుల్లో ఇరికిస్తారు.

జీవితాన్ని ఎవరిస్తారు?


టాడా, యుఎపిఎ అవసరం లేదు..!
భారతీయ శిక్షాస్మతి ఐపిసిలో నిబంధనలు ఉన్నందున ఇవి అవసరం లేదు. ఒకవేళ కఠినమైన చట్టాన్ని కలిగి ఉండాలనుకుంటే దానినుండి బెయిల్‌ మినహాయించలేరు. బెయిల్‌ ఒక హక్కు, జైలు మినహాయింపు. కచ్చితంగా చెప్పాలంటే, ఈ చట్టం అవసరం లేదు. అల్లర్లు జరిగితే, ఐపిసి కింద నిబంధనలు ఉన్నాయి. వారు కోరుకుంటే, వారు దానిని మరింత కఠినంగా చేయవచ్చు. పేలుడు జరిగితే, పేలు డు పదార్థాల చట్టం ఉంది. దానికోసం ప్రత్యేక చట్టం ఎందుకు? వారు కొత్త చట్టం కోరుకున్నా, అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడదు. కాబట్టి యుఎపిఎ రాజ్యాంగానికి వ్యతిరేకం? కచ్చితంగా చెప్పాలంటే దీన్ని ఎవరూ తీవ్రంగా సవాలు చేయలేదు. ప్రజా ప్రయోజన పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉంది.

గోద్రా రైలు ఘటనలో..
దేశ వ్యాపితంగా సంచలనం రేపిన గోద్రా రైలు దగ్ధం కేసులో అహ్మదాబాద్‌ న్యాయస్థానం 11 మందికి ఉరిశిక్ష విధించింది. మరో 20 మందికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2002లో అయోధ్య కరసేవకులు తిరిగి వస్తుండగా గోద్రా రైల్వేస్టేషన్‌లో వారిపై కొందరు దాడి చేశారు. కరసేవకులు ప్రయాణిస్తున్న ఎస్‌-6 బోగీపై కిరోసిన్‌ పోసి, నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 58 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనతో గుజరాత్‌ రాష్ట్రమంతా మత కలహాలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 1200 మందికి పైగా అమా యకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కేసు విచారిం చిన అహ్మదాబాద్‌ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు మొత్తం 94 మందిపై విచారణ జరిపింది. శాస్త్రీయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షులు, డాక్యుమెంటరీ ఆధారాలు తదితరాలను పరిశీలించింది. నిందితులుగా పేర్కొన్న 63 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.. 31 మందికి మాత్రమే శిక్షలు ఖరారు చేసింది. అత్యంత అరుదైన కేసుగా పరిగణించి, ప్రత్యేక న్యాయ స్థానం న్యాయమూర్తి జస్టిస్‌ పిఆర్‌ పటేల్‌ ఈ తీర్పునిచ్చారు.

జీవితాన్ని ఎవరిస్తారు?


సూరత్‌ పేలుడు కేసుల్లో..
సూరత్‌ పేలుడు కేసు (1993) లో జస్టిస్‌ టి.ఎస్‌ ఠాకూర్‌ నేతత్వంలోని సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచ్‌ 11 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. టాడా టెర్రరిస్ట్‌ అండ్‌ డిస్ట్రప్టివ్‌ యాక్టివిటీస్‌ (ప్రివెన్షన్‌) చట్టం కింద కోర్టు 2008 తీర్పును తిరస్కరించింది. అప్పటి కాంగ్రెస్‌ మంత్రిగా ఉన్న మహ్మద్‌ సుర్తి, మరో నలుగురికి జులై 2014లో 20ఏళ్ల జైలుశిక్ష విధించారు. మరో కేసులో సూరత్‌ పోలీసులు క్రూరమైన యుఎపిఎ సెక్షన్ల కింద 127 మందిని అరెస్టు చేశారు. అయితే 19 ఏళ్ల శిక్ష అనంతరం, అక్కడి న్యాయస్థానం నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని పేర్కొంది. నిషేధిత స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) లో సభ్యులుగా ఒక సమావేశంలో పాల్గొన్నారనే అభియోగంపై సూరత్‌ కోర్టు డిసెంబర్‌ 2001లో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ), 1967 కింద అరెస్టయిన 127 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఘటన జరిగి 19 ఏళ్ల తరువాత, మార్చి 6, 2021న, చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఏఎన్‌.డేవ్‌ నిందితులను అనుమానించడానికి, సిమికి చెందినవాడు అని నిర్ధారించడానికి సాక్ష్యాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని తెలిపారు. అయితే విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో 127 మందిలో ఐదుగురు మరణించారు.

జీవితాన్ని ఎవరిస్తారు?


ఆయేషా హత్య కేసులో కీలకాంశాలు..
బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా 14 ఏళ్ల క్రితం.. (2007, డిసెంబర్‌ 12) దారుణ పరిస్థితుల్లో శవమై కనిపించింది. ఆమెపై హత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై పోలీసులు 2008 ఆగస్టు 11న సత్యంబాబును అరెస్ట్‌ చేశారు. 2010లో సత్యంబాబుకు విజయవాడ సెషన్స్‌ కోర్టు 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఐతే ఎనిమిదేళ్ల అనంతరం.. హైకోర్టు అతన్ని నిర్దోషిగా నిర్ధారించింది. దీంతో 2017, మార్చి 31న సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. ఆ తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అసలు నిందితుల్ని పట్టుకునేందుకు హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. 2018 నవంబర్‌ 29న సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో 2019 జనవరిలో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసుకు సంబంధించిన పలు కీలక ఆధారాలను సేకరించింది.

జీవితాన్ని ఎవరిస్తారు?


ఓ నిర్దోషి కథే 'నాంది'
చట్టాలు చేతకానివాడిపై వాడటానికేనా? పవర్‌లో ఉన్నోడిని ఏమీ చేయలేవా? చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ.. సెక్షన్‌ 211 ఉపయోగించి, అసలు నేరస్థుల ఆట ఎలా కట్టించవచ్చో.. ''నాంది'' చిత్రంలో చూపించాడు దర్శకుడు విజరు కనకమేడల. ఇక కథలోకి వెళ్తే.. బండి సూర్యప్రకాష్‌ (అల్లరి నరేష్‌) మధ్య తరగతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. తొలిచూపులోనే మీనాక్షి (నవామి గాయక్‌) ప్రేమలో పడ్డ సూర్యప్రకాష్‌ పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకుని.. అమ్మ, నాన్న, భార్యతో అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే అనూహ్యంగా సూర్యప్రకాష్‌ని న్యాయవాది, మానవహక్కుల కోసం పోరాడే సామాజిక ఉద్యమకారుడు రాజగోపాల్‌ (సీవీఎల్‌ నరసింహా రావు) మర్డర్‌ కేసులో ఇరికించి, జైలుకి పంపుతాడు సీఐ కిషోర్‌ (హరీష్‌ ఉత్తమన్‌). ఆ కేసును తానే చేశానని బలవంతంగా ఒప్పించే ప్రయత్నమూ చేస్తాడు. అయితే దానికి ఒప్పుకోడు సూర్యప్రకాష్‌. ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గుతూ.. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ.. తల్లిదండ్రులతో పాటు కట్టుకున్న భార్యను కోల్పోతాడు సూర్యప్రకాష్‌.

కోర్టులో సాక్ష్యాలు, ఆధారాలు సూర్యప్రకాష్‌కి వ్యతిరేకంగానే ఉండటంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. ఆ తరుణంలో జూనియర్‌ లాయర్‌ ఆద్య (వరలక్ష్మీ శరత్‌కుమార్‌).. సూర్యప్రకాష్‌ని బెయిల్‌పై బయటకు తీసుకుని వస్తుంది. అయితే సామాజిక ఉద్యమకారుడు రాజగోపాల్‌ కుమార్తె ఆద్య. హోమ్‌ మినిస్టర్‌ నాగేంద్ర (వినరు వర్మ) కి వ్యతిరేకంగా, అనేక కేసుల్లో అన్యాయంగా అరెస్టయిన సూర్యప్రకాష్‌ లాంటి వారిని బయటకు తీసుకొచ్చేందుకు రాజగోపాల్‌ ప్రయత్నిస్తాడు. రాజగోపాల్‌ లక్ష్యం నెరవేరితే అనేక కేసుల్లో తాను దోషిగా నిరూపితమవుతానన్న భయంతో మినిస్టర్‌ నాగేంద్ర సిఐ సహాయంతో సూర్యప్రకాష్‌ని ఇరికిస్తాడు. సెక్షన్‌ 211తో సూర్యప్రకాష్‌ నిర్దోషిగా ఎలా బయటపడ్డాడు? అన్నదే ''నాంది'' మిగిలిన కథ.

జీవితాన్ని ఎవరిస్తారు?


తొలి సీన్‌లోనే పోలీస్‌స్టేషన్‌లో నగంగా పోలీస్‌ల ముందు చేతులు కట్టుకుని, కింద కూర్చున్న అల్లరి నరేష్‌.. చేయని నేరానికి శిక్ష అనుభవించడం.. తిరిగి అసలు నేరస్థులపై ప్రతీకారం తీర్చుకోవడం అనేది పాత కథే. అయితే ఈ కథలో సెక్షన్‌ 211 అనే కొత్త అంశాన్ని మిళితం చేసి, న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అయితే రెగ్యులర్‌ కథలకు ఇది భిన్నమైంది. ఇందులో బీభత్సమైన రక్తపాతం ఉంటుంది కానీ.. ఆ రక్తపాతం అంతా విలన్ల చేతులో తన్నులు తినే హీరో శరీరం నుంచి వచ్చిందే. కథలో ఆత్మ పోకుండా హీరోయిజానికి దూరంగా కేవలం ఓ నిర్దోషి మనోవేదనను పెయిన్‌ఫుల్‌గా చూపించాడు దర్శకుడు. అయితే సినిమాలో మాదిరిగా నిజజీవితంలో ఇలాంటి కేసు నుండి బయటపడటం అంత సులువుకాదు.. మరి అలాంటి నిర్దోషుల పరిస్థితి ఏంటి? వారు నిర్దోషులుగా రుజువు కాకపోతే? వారి జీవితాలకు విలువ లేదా? అనే సందేహం తలెత్తక మానదు. ప్రస్తుతం వరుస కేసుల్లో కోర్టు వెలువరించే తీర్పులూ ఈ సందేహాల్నే లేవనెత్తుతున్నాయి.

జీవితాన్ని ఎవరిస్తారు?


మీకు తెలుసా..?
ఆర్టికల్‌ -14 వెబ్‌సైట్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మోడీ ప్రభుత్వ హయాంలోనే దేశద్రోహ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. వ్యవసాయ నిరసనల సమయంలో ఆరు దేశద్రోహ కేసులు, సిఎఎ వ్యతిరేక నిరసనల సమయంలో 25, హత్రాస్‌ గ్యాంగ్‌రేప్‌ తర్వాత 22, పుల్వామా తర్వాత 27 కేసులు నమోదయ్యాయి. ఆర్టికల్‌-14 అధ్యయనం ప్రకారం గత దశాబ్దకాలంలో సుప్రీం మార్గదర్శకాలను ఉల్లంఘిసూ ముఖ్యంగా 2014 నుంచి విమర్శకులు, నిరసనకారులపై అక్రమంగా పెట్టిన దేశద్రోహ కేసుల సంఖ్య 28 శాతం పెరిగాయి.
                                                             * ఉదయ్‌ శంకర్‌ ఆకుల, 79897 26815