ధర్నా చేస్తున్న నాయకులు, కార్మికులు
జీవితాల్లో చీకటి నింపుకుంటున్న కార్మికులు
-స్ట్రీట్ లైటింగ్ కార్మికులు నిరసన ధర్నా
నెల్లూరు :నగర పరిధిలోని పలు డివిజన్లలో స్ట్రీట్ లైటింగ్ కార్మికులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ వీధిలైట్లను వెలిగించి ప్రజలకు వెలుగునందిస్తూ తమ జీవితాలను మాత్రం చీకటిమయం చేసుకుంటున్నారని మునిసిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ స్ట్రీట్ లైటింగ్ కార్మికులు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వీధిలైట్ల నిర్వహణలో కరెంట్ షాక్ తగిలి కార్మికులు అవయవాలు, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అనేక సంవత్సరాల నుండి చాలీచాలని జీతాలతో ప్రమాదకరమైన పరిస్థితులలో వీధిలైట్లు కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. వీధిలైట్లు బిగించే సమయంలో అనేక సందర్భాలలో కరెంటు షాక్ తగిలి స్తంభం మీద నుంచి కింద పడి అనేకమంది కార్మికులు అవయవాలు కోల్పోయి,ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. నగర ప్రజలకు వెలుగును అందిస్తూ తమ జీవితాలలో చీకటిని నింపుకుంటున్న కార్మికులుగా వీధిలైట్ల కార్మికులు ఉన్నారన్నారు. ప్రభుత్వం నుండి హెల్త్ అలవెన్స్ గాని,రిస్కలవన్స్ గాని కార్మికులకు అమలు కాకపోవడం విచారకరమని అన్నారు. తక్షణమే ఇంజనీరింగ్ కార్మికులందరికీ హెల్త్ అలవెన్స్ , రిస్క్ అలవెన్స్ లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని వాగ్దానం చేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదన్నారు. తక్షణమే మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ చేసేంతవరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ కార్మికులు చేయుచున్న ఆందోళనకు నగర ప్రజలందరూ తమ మద్దతుని అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఎం. అశోక్, స్ట్రీట్ లైట్ వర్కర్స్ యూనియన్ నాయకులు వంశీ,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.










