ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఏదో అయిపోతుందని భయపడి, చావు అంచుల వరకూ వెళ్ళొచ్చేవాళ్లే మనలో కోకొల్లలుగా ఉంటారు. అలాంటిది క్యాన్సర్ మహమ్మారి తనను కబళించే ప్రయత్నంలో ఆరుసార్లు దాడి చేసినా లెక్కచేయలేదతను. 17 కీమోథెరపీ, 60కి పైగా రేడియోథెరపీ సెషన్‌లు, ఒక ఎముక మజ్జ మార్పిడి జరిగినా అతను జీవితం మీద ఆశ వదులుకోలేదు. ఎలాగైనా ఆ మహమ్మారిని ఓడించి, జీవించాలనే కోరికే అతన్ని బతికించింది. నేడు ఎందరో క్యాన్సర్ పేషెంట్‌లకు కౌన్సెలింగ్ చేసే స్థాయికి ఎదిగేలా చేసింది. అతనే అజ్మీర్‌కు చెందిన 23 ఏళ్ల జయంత్ కండోయ్. ఎందరికో స్ఫూరినిచ్చే అతని గురించి తెలుసుకుందాం...
జయంత్ 36 కిలోల కన్నా ఎక్కువ బరువు ఉండడు. కానీ అతని మాటలు ఎదుటి వ్యక్తి మీద ఇంద్రజాలంలా పనిచేస్తాయి. చావు అంచుల్లో ఉన్న వ్యక్తైనా సరే, బతికి తనకంటూ ఈ ప్రపంచంలో ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలనే తపనను పెంచుతాయి.
నాలుగేళ్లు ఆసుపత్రిలోనే..
'ఈ చిన్న జీవితంలో తొమ్మిదేళ్లు అంటే 1,237 రోజులు సుమారు నాలుగు సంవత్సరాలు ఆసుపత్రుల్లోనే గడిపాను. క్యాన్సర్ నా నుంచి జీవితాన్ని లాక్కోలేకపోయింది. కానీ శరీరానికి అపార నష్టాన్ని అయితే కలిగించింది. 2013లో పదో తరగతి చదువుతున్న రోజుల్లో నా మెడ కుడివైపున చిన్న గడ్డ కనిపించింది. అదే క్యాన్సర్‌గా మారింది. ''హాడ్కిన్ లింఫోమా'' గురించి అదే మొదటిసారి వినడం. ఆ గడ్డ రోజురోజుకీ పెరుగుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయక తప్పలేదు. ట్రీట్‌మెంట్ మొత్తం జైపూర్ భగవాన్ మహావీర్ క్యాన్సర్ ఆసుపత్రిలోనే జరిగింది. అక్కడ ఆరు కీమోథెరపీలు చేయించుకున్నా. జనవరి 12, 2014లో క్యాన్సర్ తగ్గినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నా ఆనందానికి హద్దుల్లేవు. అప్పుడు పదో తరగతి పరీక్షలు రాసి, మంచి మార్కులు సాధించాను. నిజానికి 9వ తరగతి వరకు నేనెప్పుడూ స్కూలుకు సెలవు పెట్టిందే లేదు. తర్వాత అనారోగ్య సమస్యల వల్ల ఇంట్లోనే ఉండాల్సి వచ్చినప్పుడు మానసికంగా చాలా వేదన అనుభవించా. 2015లో ఇంటర్ చదువుతున్నప్పుడు మెడ ఎడమవైపున మరో గడ్డ ఏర్పడింది. మరలా ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందాను. అంత కష్టంలోనూ ఇంటర్ మంచి మార్కులతో పాసై, బికామ్ కోర్సులో చేరా. దురదృష్టవశాత్తు 2017లో మరలా క్యాన్సర్ వచ్చింది. ఈసారి అది నా క్లోమం (జీర్ణరసాలను తయారుచేసే గ్రంధి)లో. తరచూ విపరీతమైన కడుపునొప్పి వచ్చేది. నొప్పిని భరించలేకపోయేవాడ్ని. కేవలం సెంటీమీటరు పొడవుండే కణితిని తీసివేయడానికి కడుపులోని కొంత భాగాన్ని తొలగించాల్సి వస్తుందని నాన్నకు బాగా తెలుసు. అందుకే ఆయన చాలా ఆందోళనపడ్డాడు' అంటున్నాడు జయంత్.
చివరి శ్వాస వరకూ పోరాడతా..
అడుగడుగునా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నా లెక్కచేయకుండా దూరవిద్యా పథకం కింద గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు జయంత్. 'మా బాబు చదువుకోవడానికి బయటకు వెళ్లడం నాకిష్టం లేదు. ఏదైనా డిగ్రీ పొందడం కంటే అతని జీవితం చాలా ముఖ్యం. తొమ్మిదేళ్లుగా నా బిడ్డను ప్రాణాలతో ఉంచడానికి విధితో పోరాడుతున్నా. నా చివరి శ్వాస వరకూ పోరాడుతా' అంటున్నాడు జయంత్ తండ్రి అశోక్ కండోరు. 2019లో జయంత్‌కు గతంలో వచ్చిన చోటనే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడంతో బాధపడ్డాడు. ఒకవైపు శరీరం దెబ్బతింటున్నా.. ఎక్కడా భయాన్ని దగ్గరకు రానివ్వలేదు. ధైర్యాన్ని కోల్పోలేదు. మార్చి 2020లో కుడి చంకలో మరో కణితి ఏర్పడింది. దానికి నయం చేసుకునేసరికి నవంబర్‌లో పొత్తికడుపులో క్యాన్సర్ వచ్చింది. జయంత్ సూదులకు భయపడే వ్యక్తి కాకపోయినప్పటికీ ఎముక మజ్జ మార్పిడి అతనిని ఎంతగానో బాధించింది. 'అలా ఆరుసార్లు క్యాన్సర్ నన్ను కబళించే ప్రయత్నం చేసింది. ప్రతిసారీ మా బంధువులు ఏదో ఒక ఆశ్రమంలో వదిలెయ్యమని మా తల్లిదండ్రులకు సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఈరోజు క్యాన్సర్‌పై నా పోరాటం, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన తీరు చూసి నేను వాళ్ల అబ్బాయినని చెప్పుకుంటున్నారు' అంటున్నాడు జయంత్.
క్లబ్ వాలంటీర్లతో..
కొంతమంది స్నేహితులతో కలిసి జయంత్ 'సిటీ స్టార్ క్లబ్' అనే సంస్థను స్థాపించాడు. 'ఈ సంస్థ నా అనారోగ్యంలో నుంచి పుట్టింది. నాలాగా క్యాన్సర్‌తో బాధపడే ఎందరికో కౌన్సెలింగ్, అవసరమైన నిధులు, ఔషధాలను ఇచ్చి, అండగా నిలవాలి అనుకున్నా. ప్రస్తుతం మా సంస్థలో 350 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మరికొందరికి సహాయం చేయగలగడం సంతృప్తిగా ఉంది' అంటున్నాడు జయంత్. త్వరలోనే తను పూర్తిగా కోలుకుని, జీవితంలో తను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మనమూ కోరుకుందాం.