Nov 24,2022 00:02

వినతి పత్రం ఇస్తున్న గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్రంలో గొర్రెలు, మేకలకు ప్రభుత్వం నాణ్యమైన డి వార్మింగ్‌ నాలుగుసార్లు, వ్యాక్సినేషన్‌ రెండుసార్లు సకాలంలో వేయాలని గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం నాయకులు బుధవారం పశుసంవర్థక శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ అమరేంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంట శ్రీరామ్‌, కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి, ఉపాధ్యక్షులు పివి ఆంజనేయులు, సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు మాట్లాడుతూ సకాలంలో మందులు, వ్యాక్సినేషన్‌ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదివేల జీవాలు మృత్యువాత పడ్డాయని తెలిపారు. గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్లు ఉన్నా అవసరమైన మందులు లేకపోవడంతో జీవాలకు చికిత్స అందడం లేదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది పశు వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేయాలన్నారు. 50 శాతం రాయితీతో రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని, సీజనల్‌ వ్యాధులను నివారించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లలో మృత్యువాత పడిన జీవాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు జీవాల నిబంధన తొలగించి ఒక జీవం చనిపోయిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 559, 1016 జీవోల ప్రకారం జీవాలకు మేత స్థలం కేటాయించాలని, 100 శాతం రాయితీతో విత్తన పొట్టేళ్లు సరఫరా చేయాలని, 50 సంవత్సరాలు దాటిన పెంపకందారులకు పింఛను ఇవ్వాలని, రాత్రి బస నిమిత్తం షెడ్లు నిర్మించాలని, పెంపకం దారుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని, అటవీశాఖ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు.