Jan 03,2021 13:17

ఏ పండును ఎలా తినాలో
ఆ పండే నేర్పిస్తుంది
ఏ చెట్టును ఎలా ఎక్కాలో
ఆ చెట్టే చెబుతుంది
తీగకు బోధించరెవరూ
పందిరిని అల్లుకోమని
లేగకు శిక్షణ ఇవ్వరెవరూ
పాలపొదుగును అందుకోమని

తనకుతానే మొనలు
దిద్దుకుంటాయి
ముళ్ళు
పువ్వుల్ని రక్షించుకోడానికి
వాటికవే అప్రమత్తమౌతుంటాయి
కనురెప్పలు
చూపులదీపాన్ని కాపాడ్డానికి

తన్నుకుపోడానికొచ్చిన
గెద్దమీదికి యుద్ధానికెళ్ళమని
ఒకరు చెప్పాలా పిల్లలకోడికి
కలలు పండే పొలాల మీద
ఇనపవలలు వాలుతుంటే
వాటిని చించిపారెయ్యాలని
వివరించాలా
నాగలిమేడికి .
 

- గంటేడ గౌరునాయుడు