సవాలక్ష సమస్యలతో ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగులు సతమతం
ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.మూడు లక్షల పూచీకత్తు తప్పనిసరి
ఉద్యోగానికే టెండర్ పెట్టేలా ఏజెన్సీ నిర్ణయం
ఆందోళనలో ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగులు
ప్రజాశక్తి - భీమవరం
వాళ్లంతా ఎంటెక్, బిటెక్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివిన వారే. ఉద్యోగావకాశాలు లేక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చిరుద్యోగులుగా చేరారు. వీరికి జీతం తక్కువ.. నిబంధనలు ఎక్కువ. వీరికి జీతభత్యాలు చెల్లించే ఒక ఏజెన్సీ తీసుకున్న నిర్ణయాలపై ఆ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగం ఉండాలంటే రూ.3 లక్షలతో కూడిన ప్రభుత్వ ఉద్యోగి పూచీకత్తు తప్పనిసరి అని నిబంధన పెట్టింది. ఇది చాలదన్నట్లు ప్రభుత్వ ఉద్యోగి రూ.40 వేలు వేతనం కలిగి ఉండాలని, ఐడి కార్డు, పే స్లిప్‌లు కూడా ఇవ్వాలని హుకుం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాల చిరుద్యోగులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారు.
నాలుగేళ్ల క్రితం జగన్ తన పాదయాత్రలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా హామీ అమలు చేయకపోగా ప్రభుత్వమే మద్యాన్ని అమ్మించే పరిస్థితికి వచ్చింది. మొదట్లో మద్యాన్ని నియంత్రిస్తున్నామని చెబుతూనే మద్యం అమ్మకాలు ప్రధాన ఆదాయ వనరుగా భావించి ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతను ఎక్సైజ్ శాఖ చూస్తోంది. ఉన్న ఊరిలో ఉద్యోగం కావడంతో జీతం తక్కువైనా అప్పట్లో మద్యం దుకాణాల్లో పని చేసేందుకు ఉన్నత విద్యావంతులు సైతం క్యూ కట్టారు. ఉన్న ఉద్యోగమే గొప్ప అని సర్దుకుపోతున్నారు. అయితే ఇప్పుడు వారి ఉద్యోగ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. కఠిన నిబంధనల పేరుతో కొలువులకు ఎసరు పెట్టేందుకు ఏజెన్సీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే యువకుల దీనగాధ మాటల్లో చెప్పలేనిది.
జిల్లా వ్యాప్తంగా 109 మద్యం దుకాణాలు ఉన్నాయి. సుమారు 387 మంది వీటిలో పని చేస్తున్నారు. అప్పట్లో వైసిపి ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టింది. సేల్స్‌మెన్‌కు ఇంటర్ అర్హత, సూపర్‌వైజర్ పోస్టుకు డిగ్రీ అర్హతతో నియామకాలు చేపట్టారు. అయితే ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టకపోవడం తదితర పరిణామాల రీత్యా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చేసిన వారు సైతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేసేందుకు ముందుకొచ్చారు. అయితే అప్పట్లో విధులు సాఫీగా సాగినప్పటికీ రానురాను చిరుద్యోగం సైతం పెనుభారంగా మారింది. తాజాగా ఏజెన్సీ నిర్వాకంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఏజెన్సీలతో తలనొప్పులు
మొదట్లో ప్రభుత్వమే ఉద్యోగ నియామకాలు చేపట్టి సూపర్‌వైజర్లకు రూ.21,500, సేల్స్‌మెన్స్‌కు రూ.18,500 జీతభత్యాలు ఇచ్చేలా నిర్ణయించింది. పిఎఫ్ కటింగ్ పోను ప్రస్తుతం సూపర్‌వైజర్‌కు రూ.19,500, సేల్స్‌మెన్‌కు రూ.17,500 చేతికొస్తుంది. వీరికి జీతభత్యాలు చెల్లించేందుకు 2019లో రెడ్డిఅండ్‌రెడ్డి ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. నాలుగేళ్లపాటు ఈ ఏజెన్సీ నిర్వహణ బాధ్యత చూసింది. అయితే అప్పట్లో ఈ ఏజెన్సీ ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ ఏజెన్సీ ప్రతినెలా సక్రమంగా జీతాలు ఇచ్చిన దాఖలాల్లేవని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతో 2022లో ఉద్యోగ నిర్వహణ బాధ్యతను థర్డ్ ఎంప్లాయీస్ ఏజెన్సీకి అప్పగించారు. ఇటీవల కొత్తగా ఏజెన్సీ తీసుకొచ్చిన నిబంధన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వందలాది మంది యువకుల నెత్తిన పిడుగు పడినంత పనైంది. ఈ ఏజెన్సీ విధించిన నిబంధనలు ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టే విధంగా ఉన్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.3 లక్షలకు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పూచీకత్తు తప్పనిసరి
మద్యం దుకాణాల్లో సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లుగా చేరే సమయంలో వారి ఆస్తి దస్తావేజులు పెట్టి, లేదా బాండ్‌పేపర్లుపై సంతకాలు చేసి ఉద్యోగాల్లో చేరారు. నాలుగేళ్ల అనంతరం థర్డ్ ఎంప్లాయీస్ ఏజెన్సీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. మద్యం దుకాణాల్లో పని చేయాలంటే రూ.3 లక్షలకు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల చేత పూచీకత్తు సంతకాలు తీసుకు రావాలని హుకుం జారీ చేసింది. అంతేకాకుండా సదరు ప్రభుత్వ ఉద్యోగి ఐడి కార్డు, పే స్లిప్‌లు కూడా ఇవ్వాలని పేర్కొంది. ఇవన్నీ సమర్పిస్తేనే ఉద్యోగం ఉంటుందని, లేకపోతే తీసేస్తామని ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇది చాలదన్నట్లు సదరు ప్రభుత్వ ఉద్యోగి జీతం రూ.40 వేలకు తక్కువ కాకుండా ఉండాలనే నిబంధన కూడా పెట్టింది. ఒక సర్టిఫికేట్ మీద గెజిటెడ్ సంతకం చేయమంటేనే ఉద్యోగులు భయపడిపోయే పరిస్థితుల్లో అలాంటిది పూచీకత్తు సంతకం, ఐడి కార్డు, పే స్లిప్‌లు ఎలా ఇస్తారని సేల్స్‌మేన్లు, సూపర్‌వైజర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏజెన్సీ తీసుకొచ్చిన నిబంధనలు అసలు ఉద్యోగం ఉంచడానికా, తీసేయడానికా అనే విధంగా ఉన్నాయని మద్యం దుకాణాల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులుగా ఇటు ఏజెన్సీ, అటు ఎక్సైజ్ అధికారుల నుంచి ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో చిరుద్యోగులు మానసిక ఒత్తిడికి గురై ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.
కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధుల నిర్వహణ
కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి కనీస ఉద్యోగ భద్రత లేనప్పటికీ సదరు ఉద్యోగులు మద్యం దుకాణాల్లో పని చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడంతోపాటు మరికొంతమంది తీవ్ర అనారోగ్యానికి గురై వేలాది రూపాయలు వైద్యానికి ఖర్చుపెట్టిన ఘటనలూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం తీసుకొస్తున్న తమ పట్ల ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని సంబంధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏజెన్సీ నిర్ణయాలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.










