ప్రజాశక్తి-పిడుగురాళ్ల : అంగన్వాడీలకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని అంగన్వాడి వర్కర్స్ - హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లీశ్వరి అన్నారు. స్థానిక మార్కెట్ యార్డు వద్ద సోమవారం నిర్వహించిన అంగన్వాడీల మండల సమావేశానికి డి.శాంతమణి అధ్యక్షత వహించారు. మల్లీశ్వరి మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని హామీచ్చిన జగన్ మాట తప్పారని, పైగా నెలల తరబడి టిఎ, డిఎ బిల్లులు, సెంటర్ అద్దెలు పెండింగ్లో ఉంచారని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వైఎస్‌ఆర్ పోషణ మెనూ చార్జీలను,సెంటర్ అద్దెలను పెంచాలని డిమాండ్ చేశారు. బిఎల్‌ఒ డ్యూటీల నుండి అంగన్వాడీలను మినహాయించాలన్నారు. ఈ డ్యూటీల వల్ల అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని విన్నవిస్తున్నా ప్రభుత్వం మాత్రం విస్మరించడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలని, కనీసం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అర్హులను సూపర్‌వైజర్లు, టీచర్లుగా ప్రమోట్ చేయాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంత్‌రెడ్డి మాట్లాడుతూ వైసిపి పాలనలో అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు పెరిగాయని, దీనిలో భాగంగానే ఓ అంగన్వాడి టీచర్‌పై టీచర్‌పై అధికార పార్టీ నాయకుడు ట్రాక్టర్ తోటి తొక్కించి దారుణంగా చంపేశారని మండిపడ్డారు. రకరకాల సాకులతో అంగన్వాడిలను ఉద్యోగం నుండి తొలగించాలని చూస్తున్నారని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు ఐక్యంగా పెద్దఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టే 'అంగన్వాడీల పోరుబాట' కార్యక్రమంలో అందరూ పాల్గొనాలన్నారు. సమావేశంలో షేక్ ఖుదా జోష్ని, దుర్గ, నాగమణి, జానీ బేగం, ఆషా, ముంతాజ్, హసీనా, జయశ్రీ, విజయలక్ష్మి పాల్గొన్నారు.










