ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ పాఠశాల విద్యా శాఖ, ఆర్థిక శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 1,800 మంది ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. జూన్, జులై నెలలో జీతాలు ఇప్పటికీ అందని పరిస్థితి నెలకొంది. జీతాలకు సంబంధించి సప్లిమెంటరీ బిల్లులు అప్‌లోడ్‌కు కూడా గడువు ముగియడంతో ఈ నెల కూడా జీతం వచ్చే అవకాశం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. బిల్లుల అప్‌లోడుకు మళ్లీ వచ్చే నెల ఆరో తేదీ వరకు ఆగాల్సిందేనని చెబుతున్నారు. ఈ ఏడాది జూన్లో ఉపాధ్యాయుల బదిలీలు చేప ట్టారు. అదే సమయంలో కొందరికి పదోన్నతులు ఇచ్చి బదిలీ చేశారు. అంతకుముందు ముందు విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో పోస్టులు రద్దు చేసి ఎక్కువ మంది పిల్లలున్న చోటకు (హేతుబద్ధీకరణ) బదలాయించారు. ఈ విషయాన్ని ట్రెజరీకి విద్యా శాఖ తెలియపరచాలి. ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోవాలి. ఈ విషయాన్ని ట్రెజరీ అధికారులు జూన్ మూడో వారంలోనే చెప్పినా పాఠశాల విద్యా శాఖ పట్టించుకోలేదు. దీంతో ఆ నెల బిల్లులు అప్‌లోడ్ సాధ్యం కాలేదు. కాగా జూలై ఆరు నుంచి పదో తేదీ మధ్యన సప్లిమెంటరీ బిల్లులు పెట్టే సమయానికి కూడా ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు పోరాటం చేయగా ఈ నెల పదో తేదీన ఆర్థిక శాఖ అనుమతి లభించిందంటూ పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు ఖజానా శాఖ డైరెక్టర్‌కు తెలిపారు. కొన్నిచోట్ల సబ్ ట్రెజరీ అధికారులు వెంటనే సప్లిమెంటరీ బిల్లులు అప్లోడ్ చేశారు. కానీ ఉమ్మడి తూర్పు గోదాకారి జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బదిలీ అయిన, పదోన్నతి పొందిన, హైస్కూల్ ప్లసు పీజీటీలుగా వెళ్లిన సుమారు 1,800 మంది ఉపాధ్యాయులకు ఇంతవరకు జీతాలు అందలేదు. వీరందరికీ పెండింగ్‌లో ఉన్న జూన్, జూలై నెలల జీతాలు అక్టోబరు తొలివారంలోనే జీతాలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.










