జీతాలు ఇవ్వాలని కార్మికుల ధర్నా
ప్రజాశక్తి-కావలి రూరల్ : కావలి పట్టణంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య పాల్గొని మాట్లాడుతూ కార్మికులకు ఇవ్వాల్సిన కొబ్బరి నూనెలు, సబ్బులు, యూనిఫారం, బూట్లు మున్సిపల్ అధికారులు ఇవ్వడం లేదని, ఇవ్వమని అడుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ఇదిగో.. అదుగో.. అని దాటవేత ధోరణతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. పనిముట్లు కూడా ఇవ్వడం లేదని, పుష్కార్డులు దెబ్బతిని సక్రమంగా పనిచేయకుండా ఉన్నప్పటికీ పుష్కార్డులు రిపేరు చేయించకుండా గ్లౌజులు, చీపుర్లు సక్రమంగా ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. డైలీ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు బకాయిలుగా ఉన్నాయని తెలిపారు. ఒకరిద్దరు కార్మికులు కొన్ని ఇబ్బందుల వల్ల ఐదు నిమిషాలు లేటుగా వస్తే మస్టర్ వెయ్యకపోవడం చాలా అన్యాయమన్నారు. ఇలాంటి చర్యలను అధికారులు మానుకోవాలని, కార్మికులు ఎంతో కష్టపడి పనులు చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారని తెలిపారు. అలాంటి కార్మికులు కొన్ని సందర్భాల్లో ఐదు నిమిషాలు లేటుగా వస్తే మస్టర్ వేయకపోవడం చాలా విచారకరమైన విషయమన్నారు. వారికి అధికారులు ఇవ్వాల్సిన వస్తువులను సక్రమంగా ఇవ్వకుండా పనిముట్లు కూడా ఇవ్వకుండా చేయడం ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్, జి.మధుసూదన్ రావు, పి.తిరుపాలు బి.కృష్ణయ్య, యూనియన్ నాయకులు తురక సీనయ్య, ఒంగోలు రమేషు, కె.శివకోటయ్య, పి.జేమ్స్, ఎస్.ఆనందరావు, కె.బాబు, పి.అనిత, చిన్నమ్మ, జి.శ్రీనివాసులు, కార్మికులు పాల్గొన్నారు.










