ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ నగర సంస్థ పరిధిలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) వాహన డ్రైవర్లకు సకాలంలో జీతాలు ఇప్పించాలని గురువారం నగర పాలక కమిషనర్ నాగ నరసింహారావుకు సిఐటియు ఆధ్వర్యంలోకలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ క్లాప్ వాహన కాంట్రాక్టు సంస్థ అయిన స్వయంభూ ట్రాన్స్‌పోర్ట్ ప్రతి నెలా 20వ తేదీ దాటిన తరువాతనే జీతాలు చెల్లించడం సమంజసంగా లేదన్నారు. అధికారుల సమక్షంలో 10వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏనాడూ అమలు చేయలేదన్నారు. కమిషనర్ దీనిపై స్పందించి కాంట్రాక్టు సంస్థతో మాట్లాడగా సిడిఎంఎ నుంచి తమకు బిల్లు రాలేదని సమాధానం చెప్పినట్లు చెప్పారు. క్లాప్ డ్రైవర్స్‌కు ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల డ్రైవర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో యూనియన్ నాయకులు ఎన్.గంగాధర్, టి.సూరిబాబు, టి.గంగాధర్, కె.రాము తదితరులు ఉన్నారు.










