
ప్రజాశక్తి-గుంటూరు : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్ చేశారు. ఏ.పి.గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశం పాతగుంటూరులోని సిఐటియు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. సమావేశానికి కె.సుబ్బారావు అధ్యక్షత వహించగా నేతాజి మాట్లాడుతూ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులు నెలల తరబడి జీతాలు అందక, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పండుగలు, పిల్లల చదువులు, ఇతర అవసరాలకు అప్పులు కూడా దొరకడం లేదని చెప్పారు. ఫిరంగిపురం లాంటి పంచాయతీల్లో ఏడు నెలలుగా జీతాలు చెల్లించలేదని, కార్మికుల బాధను అర్థం చేసుకొని జీతాలు చెల్లించేందుకు వెంటనే తగు ఏర్పాట్లు చేయాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో గత మూడు నాలుగేళ్లుగా జీతాలు పెంచకపోతే కార్మికుల కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. ఏటా కనీసం 10 శాతం చొప్పున కార్మికుల జీతాలు పెంచాలన్నారు. యూనిఫాం, సబ్బులు, నూనె, గుర్తింపు కార్డులు తదితర సౌకర్యాల అమలు కోసం కూడా కార్మికులు దేబిరించాల్సిన పరిస్థితులు నెలకొనడం శోచనీయమన్నారు. అధికారులు జోక్యం చేసుకొని అన్ని పంచాయతీల్లో కనీస సౌకర్యాలు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశం అనంతరం జిల్లా పంచాయితీ అధికారి, డివిజనల్ పంచాయితీ అధికారి కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీరాములు, మానిక్యారావు, పుల్లయ్య పాల్గొన్నారు.
సమస్యలపై కార్యదర్శులతో చర్చలు
ప్రజాశక్తి - పెదకాకాని రూరల్ : గ్రామపంచాయతీ కార్మికులకు కనీస మేతను ఇవ్వాలని కోరుతూ గ్రామపంచా యతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం పెదకాకాని పంచాయతీ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. ఈ సంద ర్భంగా శివాజీ మాట్లాడుతూ గ్రీన్ అంబాసి డర్లకు ఇస్తున్న రూ.6 వేలు కుటుంబ పోషణకు ఏమాత్రమూ సరిపోవని, నిత్యాసర వస్తువుల ధరలు విప రీతంగా పెరిగిన నేపథ్యంలో వాటికి అనుగుణంగా జీతాలు ఇవ్వాలని కోరారు. సబ్బులు, నూనె, యూనిఫామ్, మాస్కులు ఇవ్వాలని, పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీల నిర్వహణ తీరు సరిగా లేదని, జీతాలు పెంచాలని గ్రీన్ అంబాసి డర్లు అడుగుతుంటే బెదిరిస్తున్నారని అన్నారు. విధుల్లో ఉన్న కార్మికులకు ప్రమాదం జరిగాన పట్టించుకోవడం లేదని, దీనిపై ప్రభుత్వమే బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని అదుకోవాలని కోరారు. పెదకాకాని, వెనిగండ్ల, తక్కెళ్ల పాడు, ఉప్పలపాడు పంచాయతీల్లో కార్యద ర్శులు లేరని, మూడు పంచాయతీలకు కలిపి ఒక ఇన్చార్జీలు మాత్రమే ఉన్నారని, సమస్యలు చెప్పటానికి వెళితే అధికారులు అందుబాటులో ఉండటం లేదని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ మండల కార్యదర్శి కె.సుబ్బారావు, ఆదిలక్ష్మి, రాజకుమారి, మార్తమ్మ, మరియమ్మ, సుజాత, రామస్వామి పాల్గొన్నారు.