Nov 05,2023 20:57

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో పలు విభాగాల ఉద్యోగులు జీతాలను ఈ మున్సిపల్‌ కార్యాలయం నుండి తీసుకుంటూ, విధులను మాత్రం వేరే మున్సిపల్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడి కార్యాలయంలో పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఇతర అధికారులకు అదనపు పని భారం పడి తీవ్ర ఒత్తిడికి గురై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు ఈ మున్సిపాలిటీలో అధికారుల కొరత కూడా ఎక్కువగానే ఉంది. పరిపాలన విభాగానికి సంబంధించి మేనేజర్‌ పోస్టు, టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి రెండు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, ఒక టిపిఎస్‌ పోస్టు ఖాళీగా ఉంది. అలాగే ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు ఇక్కడ జీతాలు తీసుకుంటూ నెలిమర్ల, రాజాం నగర పంచాయితీల్లో విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్‌ అకౌంటెంట్‌గా ఈ మున్సిపాలిటీలో విధులలో చేరిన సత్యవతి డిప్యూటేషన్‌పై జివిఎంసిలో విధులు నిర్వహిస్తున్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌గా ఇక్కడ జీతం తీసుకుంటూ డిప్యూటేషన్‌పై బొబ్బిలి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఎంపి శైలజ డిప్యూటేషన్‌ రద్దయిన అక్కడే విధులు నిర్వహిస్తుండడం విశేషం. ఇటీవల ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ విధుల నిర్వహణలో అలసత్వంతో సస్పెండ్‌ అయి సాలూరు మున్సిపాలిటీకి పోస్టింగ్‌ ఇవ్వడంతో ఏర్పడిన ఖాళీతో పాటు ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టు కూడా ఖాళీలు ఉన్నాయి. అనధికారకంగా పట్టణ జనాభా 70 వేలు దాటింది. ఈ మున్సిపాలిటీ జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. అయినా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాల్సి పరిస్థితుల్లో ఉద్యోగుల కొరత పట్టి పీడిస్తోంది. అంతేకాక పలు విభాగాల ద్వారా పట్టణ ప్రజలకు అందాల్సిన సేవలు సకాలంలో జరగడంలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారుల పాత్ర చాలా ముఖ్యం. కావున ఈ విషయంపై స్థానిక పాలకవర్గ కౌన్సిల్‌ సభ్యులతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడు దృష్టి పెట్టి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులను మున్సిపల్‌ కార్యాలయానికి రప్పించేలా చర్యలు చేపడితే కార్యాలయంలో జరగాల్సిన పనులు సకాలంలో జరిగే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉండదని కార్యాలయంలో ఉన్న పలు విభాగాలు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడును వివరణ కోరగా మూడు సార్లు ఆర్‌డిఎం దృష్టికి తీసుకెళ్లామని, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని అన్నారు.