
జీరో ప్రసవాలపై కలెక్టర్ అసహనం
- ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల లక్ష్యం సాధించాలి
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లాలోని దీబగుంట్ల, టంగుటూరు పీహెచ్సీలలో జీరో డెలివరీలు చూపించడంపై జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైద్య, విద్యాశాఖల ప్రగతిపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలవారీ కేటాయించిన లక్ష్యం మేరకు గర్భిణులు ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కేటాయించిన లక్ష్యాలను తూచా తప్పకుండా సాధించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సెప్టెంబర్ మాసానికి సంబంధించి 255 డెలివరీల లక్ష్యం కాగా 136 మాత్రమే చేశారన్నారు. డోన్ ఏరియా ఆసుపత్రిలో ముగ్గురు గైనకాలజిస్టులు ఉన్నప్పటికీ డెలివరీ లక్ష్యాన్ని సాధించడంలో ఎందుకు విఫలమయ్యారని కలెక్టర్ ప్రశ్నించారు. అక్టోబర్ మాసానికి సంబంధించి కేటాయించిన లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమైన గర్భిణులను తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా ఇంటికి చేర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత కోఆర్డినేటర్ అధికారికి సూచించారు. అర్హులైన ప్రతి రోగికి ఆరోగ్యశ్రీ కింద సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు, చంటి పిల్లలకు ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.
నాడు-నేడు పెండింగ్ పనులు, జిఇఆర్ సర్వే పూర్తి చేయండి
నాడు నేడు కింద పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత ఎంఇఒ, పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. బడి బయట ఉన్న పిల్లలు (గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే)కు సంబంధించి నంద్యాల అర్బన్‌లో 121 మంది పిల్లలు, బనగానపల్లెలో 66 మంది, సంజామల, పాములపాడు మండలాలలో రెండు నెలల నుండి సర్వే పెండింగ్లో ఉందని, వెంటనే క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జఫ్రూళ్ల, డీఈవో సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.