Oct 31,2023 22:33

ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌
ప్రతి నియోజవర్గంలో జీరో డోర్‌ నెంబర్‌ తో నమోదైన ఓట్లను పరిశీలించి డిసెంబర్‌ 7 లోపు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. మంగళవారం వెలగపూడి సచివాలయం నుండి తుది ఓటర్ల జాబితా సవరణ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ కు జిల్లా సచివాలయం నుండి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు, డి ఆర్‌ ఓ ఎన్‌.రాజశేఖర్‌ లు వర్చువల్‌ విధానం లో హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఈఓ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా ఒకే డోర్‌ నెంబర్‌ లో 10కి పైగా ఓటర్లు నమోదు అయినట్లైతే వాటిని పరిశీలించి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులపై తగు చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో జేసి లు నిర్వహించాలని, సమాచారాన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలన్నారు. అక్టోబర్‌ 30 నాటికి జిల్లాలో ఒకే డోర్‌ నెంబర్‌ తో 10 మందికి పైగా 842 మంది ఉన్నారని, వీటిని క్షేత్ర స్థాయిలో త్వరితగతిన పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని, ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని, తప్పులు లేని తుది ఓటర్ల జాబితా తయారీకి చర్యలు చేపడతామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కి వివరించారు.