Jan 18,2023 23:25

రేషన్‌ కార్డులు అందజేస్తున్న అధికారులు

ప్రజాశక్తి-కొత్తకోట:కనీస వసతులు కల్పించాలని కోరుతూ ఆదివాసీల చేపట్టిన ఆందోళనకు జిల్లా కలెక్టర్‌ స్పందించారు. బుధవారం ప్రజాశక్తిలో వచ్చిన వార్తకు స్పందించి రావికమతం మండలం చీమలపాడు శివారు జీలుగులోవ గ్రామ ఆదివాసీ గిరిజనులతో కల్యాణపులోవ శివాలయం వద్ద తహసీల్దార్‌ మహేశ్వరరావు, ఎంపిడిఓ వెంకన్నబాబు తదితరుల అధికారుల బృందం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆదివాసీలతో అధికారుల బృందం మాట్లాడుతూ, గ్రామాన్ని కల్యాణపులోవ సమీపంలో సర్వే నెంబర్‌ 149కి గ్రామాన్ని తరలిస్తామని కుటుంబానికి రెండు సెంట్లు చొప్పున ఇంటి స్థలం కేటాయించి లే అవుట్‌ వేసి అక్కడే అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి రేషన్‌, ఆధార్‌ కార్డు, ఉపాధి హామీ పధకం, విద్యార్థులకు జనన ధ్రువ పత్రాలు అందజేస్తా మని వారికీ వివరించారు. దీనికి సమ్మతించిన ఆదివా సీలు గ్రామం తరలించే వరకు ప్రస్తుతం ఉన్న చోట వ్యవసాయం చేసుకునేందుకు వసతులు కల్పించాలని, కనీస రోడ్డు మార్గం, తాగునీరు, సోలార్‌ విద్యత్‌, గ్రావిటి స్కీమ్‌ కల్పించాలని అధికారులను కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ కు నివేదిక అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డివిజన్‌ వైద్య శాఖ అసిస్టెంట్‌ డిఎంహెచ్‌వో జ్యోతి, కొత్తకోట పిహెచ్సి వైద్యాధికారి రజిని, సర్పంచ్‌ వంజరి గంగరాజు, అంగన్వాడీ సూపర్‌ వైజర్‌ విజయ, విఆర్‌వో నాయుడు పలువురు మండల స్థాయి అధికారులు,తదితరులు పాల్గొన్నారు.