Feb 07,2023 23:43

పాంగి లోవరాజు మృతదేహం

ప్రజాశక్తి -సీలేరు
జికె.వీధి మండలం, గాలికొండ పంచాయితీ పరిధి ఆకులూరులో విషయం చోటుచేసుకుంది. జీలుగు కల్లు తాగి ఓ గిరిజన యువకుడు మృతి చెందగా, ఆయన తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు బంధువులు ప్రాణాప్రాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన గాలికొండ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. సప్పర్ల పిహెచ్‌సి వైద్యాధికారి ఈశ్వర్‌ సందీప్‌, స్థానికుల కథనం ప్రకారం... ఒడిశా రాష్ట్రానికి చెందిన కొర్ర బొందు, కొర్ర దాలిమ ఇద్దరు ఆకులూరు గ్రామంలోని తమ బంధువులు పాంగి రామదాసు ఇంటికి వచ్చారు. మర్యాదల్లో భాగంగా వారి బంధువులైన కొర్ర బొందు, కొర్ర దాలిమతో కలిసి పాంగి రామదాసు, ఆయన కుమారుడు పాంగి లోవరాజు (23) సోమవారం జీలుగు కల్లు తాగారు. కొంత సేపటికి వాంతులు, విరోచనాలతో వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇదే సమయంలో విలేజ్‌ విజిట్‌లో భాగంగా వైద్య సిబ్బంది ఆకులూరు గ్రామానికి ఉదయం వచ్చారు. వీరు నలుగురు అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి వైద్య సిబ్బంది తమ వైద్య అధికారి ఈశ్వర్‌ సందీప్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన హుటాహుటిన అంబులెన్స్‌ పంపించి వారిని సప్పర్ల పిహెచ్‌సికి తరలించి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. పాంగి లోవరాజు, పాంగి రామదాసు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే మెరుగైన వైద్య సేవల నిమిత్తం చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి పాంగి లోవరాజు మంగళవారం ఉదయం 9.15 గంటలకు మృతి చెందాడు. లోవరాజు తండ్రి పాంగి రామదాసును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఒడిశాలోని రంగినిగుడ గ్రామానికి చెందిన వీరి బంధువులు ఇద్దరు ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఒడిశా నుంచి వారి బంధువులు ప్రత్యేక వాహనంలో వారిని తీసుకెళ్లిపోయారు. వారికి ప్రాణహాని లేదని వైద్యాధికారి ఈశ్వర్‌ సందీప్‌ వెల్లడించారు. లోవరాజు మృత దేహానికి చింతపల్లి ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. లోవరాజు మృతితో ఆకులూరు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
కల్లుపై ఆరా
వీరు సేవించిన జీలుగు కల్లు కల్తీదా, మంచిదా? అనే కోణంలో గ్రామంలో గిరిజనులను ఆరా తీసినట్లు వైద్యాధికారి తెలిపారు. గ్రామంలో చాలామంది ఇదే జీలుగు కల్లు తాగినట్లు, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఇదే కల్లును రామగెడ్డలో విక్రయించడానికి తీసుకువెళ్లారని, అక్కడ సేవించిన ప్రజలకు ఎటువంటి హాని జరగలేదని గ్రామస్తులు తెలిపినట్లు వైద్యాధికారి చెప్పారు.
వివరాలు సేకరించిన పోలీసులు
మంగళవారం సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రామకృష్ణ, పోలీసు సిబ్బంది హుటా హుటిన ఆకులూరు గ్రామానికి చేరుకొని సంఘటన జరిగిన తీరును గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో జీలుగు కల్లు ఎవరెవరు సేకరించారు, ఎవరు విక్రయాలు జరుపుతున్నారు అనే కోణంలో విచారణ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ స్థానిక విలేకరులతో ఆయా గ్రామాల్లో ఇద్దరు గిరిజనులు జీలుగు కళ్ళు సేకరిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. జీలుగు కళ్ళు సేకరిస్తున్న వారి నుంచి కూడా వివరాలు సేకరించి ఆరా తీయడం జరిగిందని చెప్పారు. మృతికి గల కారణాలపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని ఎస్సై వెల్లడించారు.
విషాదకరం : ఎంపిటిసి బుజ్జిబాబు
జీలుగుకల్లు తాగి పాంగి లోవరాజు మృతి చెందడం విషాదకరమని ఎంపీటీసీ అంపరంగి బుజ్జిబాబు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ లోవరాజు మృతి, రామదాసు పరిస్థితి విషమంగా ఉండడం చాలా బాధాకరమని, లోవరాజు మృతి వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.


aఞ