Feb 13,2023 23:43

నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశ పెట్టి కేసు వివరాలు వెల్లడిస్తున్న చింతపల్లి ఎఎస్‌పి శివ కిషోర్‌

ప్రజాశక్తి -సీలేరు
జీలుగు కల్లు కల్తీ చేసి పాంగి లోవరాజు అనే యువకుని మృతికి కారణమైన మఠము త్రినాధరావును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. చింతపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఎస్‌పి శివ కిషోర్‌ కేసు వివరాలను వెల్లడించారు. ఎఎస్‌పి కథనం ప్రకారం... జీకే వీధి మండలం గాలికొండ పంచాయితీ ఆకులూరు గ్రామానికి చెందిన పాంగి రామదాసు ఇంటికి ఇటీవల ఒడిశా నుంచి బంధువులు వచ్చిన సందర్భంగా అదే గ్రామానికి చెందిన మఠం సహదేవ్‌ వద్ద 10 లీటర్ల జీలుగు కల్లును కొనుగోలు చేశారు. ఈ కల్లు తాగిన రామదాసు, ఆయన కుమారుడు పాంగి లోవరాజు, బంధువులు కొర్ర డాలిమా, కొర్ర బొందు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాంగి లోవరాజు మృతి చెందాడు. దీనిపై సీలేరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్‌పి ఆదేశాల మేరకు జికె.వీధి సిఐ అశోక్‌కుమార్‌, సీలేరు ఎస్‌ఐ రామకృష్ణ పూర్తిగా విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఆకులూరు గ్రామానికి చెందిన మఠం త్రినాధరావు, ఆయన చిన్నాన్న కొడుకు మఠం సహదేవ్‌తో కలిసి వ్యవసాయం చేస్తూ జీలుగు చెట్టు ద్వారా వచ్చిన ఆదాయాన్ని సమానంగా పంచుకునేవారు. త్రినాథరావు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి భూమి, కళ్ళు చెట్లు పంపకాలు చేసుకున్నారు. నాటి నుంచి వీరి మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. కుటుంబంతో బాగా జీవిస్తున్న సహదేవ్‌ను చూసి జీర్ణించుకోలేని త్రినాథరావు, తను వ్యవసాయం చేసి బతకలేకపోతున్నానని, జీలుగు చెట్టు తనకు ఇవ్వాలని రెండు వారాల క్రితం వాలీబాల్‌ కోర్టు వద్ద సహదేవ్‌ను అడిగాడు. కళ్లు చెట్టు ఇస్తే నేను ఎలా బతకాలని సహదేవ్‌ ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ క్రమంలో కళ్ళు ఎలా తీసి అమ్ముతావో చూస్తానని సహదేవ్‌ను త్రినాధరావు బెదిరించాడు. ఈ నేపథ్యంలోనే సహదేవ్‌ కుటుంబ సభ్యుల్ని హతమార్చాలని ఉద్దేశంతో త్రినాధరావు ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కళ్ళు చెట్టు వద్దకు వెళ్లి సమీపంలో ఉన్న బుగ్గి చెట్టు పిక్కలను పొడి చేసి కళ్లు చెట్టుకు కట్టిన బిందెలో కలిపాడు. సహదేవ్‌ ఆ తరువాత రోజు తీసిన కళ్లును అదే గ్రామంలోని ఎగువ వీధికి చెందిన పాంగి రామదాసుకు విక్రయించాడు. ఆ కళ్లు తాగిన రామదాసు, ఆయన కుమారుడు లోవరాజు, బంధువులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించి లోవరాజు మృతి చెందాడు. నాటి నుండి త్రినాథరావు గ్రామంలో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఒడిశాలోని తన కుమార్తె దగ్గరకు పారిపోవడానికి బస్సు ఎక్కడానికి నడుచుకుంటూ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కళ్ళు చెట్టును సీజ్‌ చేసి, త్రినాథరావును రిమైండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో జికే వీధి సిఐ అశోక్‌ కుమార్‌, సీలేరు ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.