కడప ప్రతినిధి : జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఫెస్ట్ కం ట్రోల్ పనితీరు గాడి తప్పింది. జిజిహెచ్ ప్రారంభ గేటు దగ్గర నుంచి చివరి ప్రాంతంలోని ఉమెన్స్ హాస్టల్స్ వరకు పాములు, క్రిమికీటకాల సంచారం అమాంతం పెరిగిపోయింది. ముందుగా డెంటల్ కళాశాల వెనుకభాగంలోని డ్రగ్స్ అండ్ కంట్రోల్ భవనం పాములకు నిలయంగా మారిందనే ఆందో ళన ఉద్యోగుల్లో నెలకొంది. డ్రగ్స్ అండ్ కంట్రోల్ భవనానికి రక్షణగోడ కొరవడిన ఫలితంగా సదరు ఉద్యోగులు నిత్యం పాములతో సహవాసం చేయాల్సి వస్తోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి రికార్డుల గదుల్లోని బీరువాల్లోకి పాములు చేరడం, ఉద్యోగుల పైకి పడగ విప్పుకుని వచ్చి తరమడం స్థాయికి పాముల స్వైరవిహారం చేరు కుంది. వైద్య విద్యార్థుల హాస్టళ్లలో తిష్ట వేసుకునే స్థాయి చేరడం అంటే ఫెస్ట్ కంట్రోల్ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు రోజుల వ్యవధిలో రెండు పాములు సెక్యూరిటీ సిబ్బంది చేతిలో చనిపోవడమంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం జిజిహెచ్‌లో క్రిము లు, కీటకాల కట్టడి చేసే ఫెస్ట్ కంట్రోల్ బాధ్యతల్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్‌కు అప్పగించింది. సదరు కాంట్రాక్టర్ నియ మించిన ఉద్యోగులపై పర్యవేక్షణ కొరవడిన ఫలి తంగా ఫెస్ట్‌కంట్రోల్ గాడి తప్పింది. ఫలితంగా జిజి హెచ్‌లో విషసర్పాల సంచారం యథే చ్ఛగా కొనసాగుతోంది. దీనిపై జిజిహెచ్ ప్రిన్సి పల్స్, సూపరింటెడెంట్స్ సీరియస్‌గా దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. ప్రతి నెలా లక్షలాది రూపాయల బిల్లుల చెల్లింపుల విషయంలో బాధ్య అధికారులతో కుమ్మక్కై ముందు వరుసలో ఉంటున్నారని, పని తీరులో చివరి వరుసన నిలుస్తున్నారనే తీవ్రమైన విమర్శవినిపిస్తోంది. ఇంత అధ్వాన పనితీరు కనబ రుస్తున్న నేపథ్యంలో ఫెస్ట్ కంట్రోల్ నిర్వాహకులకు బిల్లులు ఎలా చేస్తున్నారో తెలియడం లేదనే వాదన వినిపిస్తోంది. జిజిహెచ్‌ను పర్యవేక్షణ బాధ్యతల్ని చూస్తున్న కడప కార్పొరేషన్ కమిషనర్ ఫెస్ట్ కంట్రోల్ పనితీరును సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వేడుకోలు వినిపిస్తోంది.










