- సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర చెల్లించి, ప్రభుత్వమే రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖను స్థానిక సుందరయ్య భవన్‌లో శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు బాధ్యత తీసుకుంటామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం, జీడిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. జీడికి మద్దతు ధర ప్రకటించకపోవడం వల్ల రైతులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి మద్దతు ధరపై టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన మంత్రులు, స్పీకర్ జీడి మద్దతు ధరపై ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు. మంత్రి అప్పలరాజు చేసిన బస్తాకు రూ.తొమ్మిది వేలు ప్రకటన వల్ల జీడి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జీడి పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కేరళ తరహాలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీడి రైతుల పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు.










