ప్రజాశక్తి-బాపట్ల, బాపట్ల జిల్లా : జీడిమామిడి పంటలో తెగుళ్లు, వ్యాధులు మరియు పోషకాల లోపాలను గుర్తించడానికి కత్రిమ మేధస్సు ఆధారిత (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌ను రూపొందించారు. తెలుగు రాష్ట్ర రైతులకు మరింత మెరుగైన అవగాహన కోసం ఈ యాప్‌ను తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంచినట్లు డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం బాపట్ల జీడిమామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ కె. ఉమామహేశ్వరరావు, డాక్టర్ బి.నాగేంద్ర రెడ్డి తెలిపారు. తెలుగు భాషను చేర్చిన తర్వాత ఈ యాప్‌ని ఉపయోగించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రయోజనం పొందవచ్చన్నారు. జీడిమామిడి రైతులకు పోషకాహార లోపాలతో పాటు తెగుళ్లు మరియు వ్యాధుల సరైన నిర్వహణ కోసం తరచుగా నిపుణుల సలహా అవసరమని పేర్కొన్నారు. గ్రామాలు మరియు పొలాల మారుమూల స్వభావం కారణంగా, సలహా చాలా అవసరమైనప్పుడు సులభంగా అందుబాటులో ఉండదని, మొబైల్ టెక్నాలజీలలో సాంకేతికత ద్వారా ఇటువంటి యాప్‌లు చాలా వరకు సహాయపడతాయని పేర్కొన్నారు. మొదటగా ఈ వెబ్‌సైట్/యాప్ ద్వారా అప్‌లోడ్ చేసిన చిత్రాల నుండి దాదాపు 60 జీడిమామిడిని ఆశించే తెగుళ్లు, 20 వ్యాధులు మరియు 10 పోషక లోపాలను తక్షణమే నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రస్తుతానికి మొదటి దశలో దీనిని ఆరు తెగుళ్లు మరియు ఒక వ్యాధిని గుర్తించడానికి తయారు చేసారని చెప్పారు. రానున్న కాలంలో దీనిని ఇంకా అభివద్ధి చేస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. గుర్తించబడని లేదా అసంతప్తికరమైన ఫలితాలు వస్తే నిపుణులను సంప్రదించడానికి మరియు సోషల్ మీడియాలో ఫొటోలను భాగస్వామ్యం చేయడానికి కూడా అవకాశం ఇవ్వబడినట్లు తెలిపారు. ఈ యాప్ చీడపీడలను ముందస్తుగా గుర్తించడానికి మరియు నిర్దిష్ట ప్రాంతంలోని రైతులను అప్రమత్తం చేయడానికి సహాయ పడుతుందన్నారు. ఇంకా దేశంలోని వివిధ సంస్థల ద్వారా నివారణ చర్యల కోసం అవసరమైన సాంకేతిక సలహాలు మరియు సూచనలు అందించడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ యాప్‌ను భారత వ్యవసాయ పరిశోధన మండలి - జీడిమామిడి పరిశోధన సంచాలయం, పుత్తూరు, కర్ణాటకతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అఖిల భారత సమన్వయ జీడిమామిడి పరిశోధనా పథకము శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారని చెప్పారు. ఈ యాప్‌ను జీడిమామిడి సాగు చేస్తున్న రైతులు వినియోగించు కోవాలని కోరారు.










