
జీడిమామిడి
ప్రజాశక్తి-గొలుగొండ:గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జీడిపిక్కల ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో, జీడిమామిడి సాగు రైతులంతా తీవ్ర నష్టాలు చవి చూశారు. గొలుగొండ, కేడిపేట, కొయ్యూరు పరిసర ప్రాంతాల్లో సుమారు 800 హెక్టార్లలో జీడిమామిడి తోటలు రైతులు సాగు చేస్తున్నారు. వర్షాలు, అనూహ్య వాతావరణ మార్పులతో జీడి మామిడి పూతలు మాడిపోయి ఫలసాయం తగ్గిపోవడంతో రైతులంతా దిగాలు పడ్డారు. దీనికి తోడుగా జీడి పిక్కల ధరలు గణనీయంగా తగ్గడంతో రైతులు లబోది బోమంటున్నారు. ప్రారంభంలో మాత్రమే బస్తా ధర రూ.8500 ఉండగా వారం రోజుల తర్వాత నుంచి తగ్గుతూ ప్రస్తుతం రూ.7000 ధరకు పడిపోయింది. పిక్క నాణ్యత బట్టి రూ. 7500ల వరకు అమ్ముడుపోతుంది. కొన్నిచోట్ల జీడిపిక్కలు కొనుగోలు చేసే వ్యాపారులంతా సిండికేట్‌లు ఏర్పడి తక్కువ ధర నిర్ణయించి రైతులు దగ్గర నుంచి పిక్కలు కొంటున్నారు. దీంతో, మరో దారి లేక రైతులంతా ధర తక్కువగా ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న వ్యాపారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. జీడిపిక్కల కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నట్లయితే రైతులను ఆదుకోవచ్చు.జీడిపిక్కల ధర విపరీతంగా తగ్గినప్పటికీ జీడిపప్పు ధర ఏ మాత్రం తగ్గలేదు. బస్తా జీడిపిక్కల నుండి సుమారుగా 22 నుండి 24 కిలోల జీడిపప్పు లభిస్తుంది. మార్కెట్‌లో కిలో జీడిపప్పు రూ.600 నుండి రూ.700 వరకు అమ్ముడుపోతుంది. దీని ధరను బట్టి చూస్తేఎటువంటి నష్టం వాటిల్లుతుందో తేటతెల్లమవుతుంది. ఏడాదికోసారి కాపుకొచ్చే జీడి మామిడి తోటలపై లాభాలు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి కుటుంబ పోషణ సాగించుకునే రైతుల పరిస్థితి ఆచమ్యగోచరంగా తయారైంది. జీడిపిక్కలను నిల్వ చేసుకుని ధర పెరిగినప్పుడు అమ్ముకుందామంటే నిల్వ చేసే అవకాశం లేక, అప్పుల బాధ తట్టుకోలేక ఎప్పటికప్పుడు అమ్మేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో జీడి సాగు రైతులు అధికంగా ఉన్నారు జీడిపిక్కలను నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వ అధికారులు తగు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.