Aug 04,2023 22:27

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు

- సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి - సోంపేట: 
ఉద్దానం జీవనాడి జీడి అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. జీడికి మద్దతు ధర కల్పించడం ద్వారానే ఉద్దానం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. సోంపేటలో శుక్రవారం నిర్వహించిన సిపిఎం సమావేశంలో ఆయన మాట్లాడారు. జీడి రైతుకు మద్దతు ధర ఇవ్వడం వల్ల జీడిపంట విస్తారంగా పండితే దానిపై ఆధారపడిన జీడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. మద్దతు ధర ఇవ్వడం వల్ల ఉద్దానం అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి ముడిపడి ఉందన్నారు. జీడికి మద్దతు ధరపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. మద్దతు ధరపై స్థానిక మంత్రి సీదిరి అప్పలరాజు మౌనం వీడి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. జీడి సమస్యపై జిల్లాలో మంత్రులకు పట్టదా అని ప్రశ్నించారు. జీడి మద్దతు ధరపై టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు ఇవ్వాలని, ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. స్థానిక జీడిపిక్కలను కొనుగోలు చేసిన తర్వాతే విదేశీ జీడిపిక్కల దిగుమతికి అనుమతి ఇవ్వాలన్నారు. జీడి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, జీడి రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడి రైతులు చేస్తున్న పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు పాతిన కృష్ణమూర్తి, నాయకులు సంగారు లక్ష్మీనారాయణ, కె.సింహాచలం, జుత్తు సింహాచలం, దుబ్బ భాస్కరరావు, డి.భానమ్మ, పి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.